ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:15

నెత్తుటేర్లు పారినా..దేశం కోసమే!

నెత్తుటేర్లు పారినా..దేశం కోసమే!

 • చైనీయులు తమకన్నా అధికసంఖ్యలో ఉన్నా కూడా వెరువని మన జవాన్లు 
 • దేశరక్షణ కోసం తెగింపుతో ప్రతిదాడి 
 • పలువురికి తీవ్ర గాయాలు.. నదిలో పడిపోయిన కొందరు 
 • గల్వాన్‌ ఘటనలో వెలుగుచూస్తున్న హృదయవిదారక సంఘటనలు

అక్రమంగా చొరబడి టెంట్లు వేశారు. ఎందుకిలా? అని ప్రశ్నించినందుకు వందల మందితో వచ్చి ఘర్షణలకు కాలు దువ్వారు. నిరాయుధులని కూడా చూడకుండా మేకులు గుచ్చిన కర్రలు, బండరాళ్లు, ముళ్లతీగలు చుట్టిన రాళ్లతో భారత సైనికుల తలలు పగులగొట్టారు. ఎత్తైన పర్వతాల నుంచి లోయల్లోకి, నదిలోకి తోసేశారు. రక్తం ఏరులై పారుతున్నా.. మాతృభూమి రక్షణ కోసం భరతమాత ముద్దుబిడ్డలైన మన వీర జవాన్లు అవన్నీ భరించారు. చివరివరకూ శతృవుతో పోరాడారు. గల్వాన్‌ లోయలో సోమవారం చోటుచేసుకున్న రక్తపాతం వెనుక ఉన్న వీరోచిత దృశ్యాలివి. 

తూర్పు లఢక్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గతనెలలో బలగాల్ని మోహరించిన చైనా. పలుచోట్ల అక్రమ చొరబాట్లకు పాల్పడింది. దీంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. జూన్‌ 6న ఇరుదేశాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. రెండోవారంలో సరిహద్దుల్లోకి వచ్చిన చైనా బలగాలు భారత్‌ భూభాగంలో టెంట్లను వేశాయి. వాటిని భారత బలగాలు తొలిగించినప్పుడు ఘర్షణ చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. అనంతరం వెనక్కి వెళ్లిన చైనా బలగాలు.. పెద్దమొత్తం బలగాలతో మళ్లీ సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చాయి. జూన్‌ 14న (ఆదివారం) భారత సైనికులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత.. 


 • జూన్‌ 15 (సోమవారం) ఉదయం గల్వాన్‌ నదీ ప్రాంతంలో ఇరు దేశాలకు చెందిన కర్నల్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు
 • సోమవారం సాయంత్రం గల్వాన్‌ లోయలో ఇరు వర్గాల మధ్య బాహాబాహి. తీవ్రమైన ఘర్షణలు. తోపులాటలు, ఘర్షణల్లో నదిలో పడిపోయిన భారత సైనికులు
 • చైనా బలగాలు వెనక్కి వెళ్లకపోవడంతో, ఆయుధాలు లేకుండా ఘర్షణ ప్రదేశానికి చేరుకున్న కర్నల్‌ సంతోశ్‌ బాబు నేతృత్వంలోని 16 బీహార్‌ రెజిమెంట్‌ బృందం. చైనా అధికారులతో చర్చలు జరుపడానికి ప్రయత్నాలు
 • భారత సైనికులపై బండరాళ్లు, ముళ్ల తీగతో చుట్టిన రాళ్లు, రాడ్లు, మేకులు గుచ్చిన కర్రలతో సుమారు 600 మంది చైనా సైనికుల దాడులు. ప్రతిఘటించిన భారత సైనికులు (అయితే, కాల్పులు జరుగలేదని భారత సైనిక వర్గాల సమాచారం)
 • చైనా బలగాల మొదటి దాడిలో తీవ్రంగా గాయపడిన కర్నల్‌ అధికారిని, హవల్దార్‌ను వెనక్కి తీసుకొచ్చిన మిగతా భారత సైన్యం. అయితే, గాయపడి అక్కడే పడిపోయిన భారత జవాన్లను బందీలుగా చేసి తీసుకుపోయిన చైనా బలగాలు
 • 40 నిముషాల తర్వాత, తొలి దాడి జరిగిన ప్రాంతానికి మళ్లీ చేరుకొని మిగతా సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన సైనిక బృందం. మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రం
 • భారత జవాన్లపై రెండో దాడి చేసిన చైనా బలగాలు. తీవ్ర ఘర్షణలు. ఈ ఘటనలో 55-56 మంది (అంచనా) చైనా సైనికులకు గాయాలు. ఈ ఉద్రిక్తతలు పర్వత ప్రాంతంపై జరుగడం వల్ల శిఖరం నుంచి కిందకు, గల్వాన్‌ నదిలోకి పడిపోయిన ఇరుదేశాలకు చెందిన సైనికులు. (ఇదే సమయంలో ఇరు దేశాలకు చెందిన ఎక్కువ మంది సైనికులు మరణించారు)  
 • అర్ధరాత్రి వరకు కొనసాగిన తోపులాటలు, ఘర్షణలు. బండరాళ్లు, ముళ్ల తీగతో చుట్టిన రాళ్లు, రాడ్లు, మేకులు గుచ్చిన కర్రలను ఘర్షణ సమయంలో ఉపయోగించడంతో పలువురు భారత సైనికుల తలలకు గాయాలు
 • మొత్తం ఆరుగంటలపాటు కొనసాగిన ఘర్షణలు
 • అర్ధరాత్రి దాటాక ముగిసిన ఘర్షణలు. తోపులాటలు, దాడుల్లో నదిలో పడిపోయిన సైనికులను, కొన్ని మృతదేహాలను వెలికితీసిన బలగాలు. తీవ్ర గాయాలు కావడం..ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉదయం మరణించిన పలువురు సైనికులు.

అమర జవాన్లు  కర్నల్‌: బీ సంతోశ్‌బాబు, 

నాయబ్‌ సుబేదార్లు: నందురామ్‌ సోరెన్‌, మన్‌దీప్‌సింగ్‌, సత్నామ్‌సింగ్‌. హవల్దార్లు: కే పళణి, సునీల్‌కుమార్‌, బిపుల్‌ రాయ్‌, నాయక్‌ దీపక్‌.

సిపాయిలు: రాజేశ్‌ ఒరాంగ్‌, కుందన్‌ కుమార్‌ ఓఝా, గనేశ్‌ రామ్‌, చంద్రకాంత ప్రధాన్‌, అంకుశ్‌, గుర్బిందర్‌,  సిపాయ్‌ గుర్తేజ్‌సింగ్‌, చందన్‌కుమార్‌, కుందన్‌ కుమార్‌, అమన్‌కుమార్‌, జైకిశోర్‌ సింగ్‌, గణేశ్‌ హన్స్‌డా.


logo