మంగళవారం 26 మే 2020
National - May 15, 2020 , 14:57:26

'గోల్‌' ను ప్రారంభించిన కేంద్రమంత్రి అర్జున్‌ ముండా

'గోల్‌' ను ప్రారంభించిన కేంద్రమంత్రి అర్జున్‌ ముండా

ఢిల్లీ : కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్‌ ముండా నేడు గోల్‌ (గోయింగ్‌ ఆన్‌లైన్‌ యాజ్‌ లీడర్స్‌) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫేస్‌బుక్‌ సహకారంతో గిరిజన యువతకు డిజిటల్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమమే ఈ గోల్‌. వెబ్‌నార్‌ పోర్టల్‌ ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్‌ సరుతా, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ దీపక్‌ ఖండేకర్‌, ఇతర సీనియర్‌ అధికారులు, ఫేస్‌బుక్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ ముండా మాట్లాడుతూ... డిజిటల్‌ మోడ్‌ ద్వారా గిరిజన యువతకు మెంటార్‌షిప్‌ అందించడానికి గోల్‌ కార్యక్రమం రూపొందించబడిందన్నారు. గిరిజన యువతలో దాగివున్న ప్రతిభను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

అదేవిధంగా వారి వ్యక్తిగత అభివృద్ధికి, మొత్తంగా గిరిజన సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 5 వేల మంది యువ గిరిజన పారిశ్రామివేత్తలు, నిపుణులు, ఆర్టిస్టులకు డిజిటల్‌ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఔత్సాహిక గిరిజన యువత goal.tribal.gov.in  పోర్టల్‌కు లాగిన్‌ అయి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జులై 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి నిపుణులు, ఉపాధ్యాయులు మెంటార్‌లుగా goal.tribal.gov.in  పోర్టల్‌కు లాగిన్‌ అయి దరఖాస్తు చేసుకోసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. 


logo