గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 11:28:13

వదంతులు వద్దు

వదంతులు వద్దు
  • కరోనా విషయంలో వైద్యుల సలహాలు పాటించండి
  • జన్‌ ఔషధి కేంద్రాలతోరూ.2,500 కోట్లు ఆదా
  • వైద్యులు జనరిక్‌ మందులే సిఫారసు చేసేలా రాష్ర్టాలు చర్యలు తీసుకోవాలి
  • ప్రధానమంత్రి మోదీ సూచన

న్యూఢిల్లీ, మార్చి 7: కరోనా వైరస్‌ విషయంలో ప్రజలు వదంతులను నమ్మవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. వైద్యుల సలహాలు మాత్రమే పాటించాలని సూచించారు. షేక్‌హ్యాండ్‌లకు స్వస్తి చెప్పి మన సంస్కృతి అయిన ‘నమస్తే’తో పలుకరించుకోవాలని కోరారు. ‘జన్‌ ఔషధి దివస్‌' సందర్భంగా శనివారం పలువురు జన్‌ ఔషధి కేంద్రాల యజమానులు, లబ్ధిదారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీటిని ‘ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఔషధి పరియోజన్‌' (పీఎంబీజేపీ) కార్యక్రమం కింద ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జనరిక్‌ మందుల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు భారీగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.


పీఎంబీజేపీ కింద ప్రతి నెల దాదాపు కోటి కుటుంబాలకు తక్కువ ధరకే మందులు అందుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆరువేల జన్‌ ఔషధి కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటి ద్వారా ఇప్పటివరకు ప్రజల సొమ్ము దాదాపు రూ.2,500 కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు. క్యాన్సర్‌ చికిత్స మందులు మార్కెట్‌లో రూ.6,500కు దొరికితే జనరిక్‌ మందులు రూ.850కే దొరుకుతున్నాయని ఉదహరించారు. తక్కువ ధరకే మందులు లభించడాన్ని తట్టుకోలేక కొందరు జనరిక్‌ మందులపై పుకార్లు ప్రచారం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.  వైద్యులు జనరిక్‌ మందులు సిఫారసు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 


మీరే డాక్టర్లుగా మారొద్దు 

కరోనా వైరస్‌ గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘మీరేం చేసినా డాక్టర్ల సలహా తీసుకోండి. మీరే డాక్టర్లుగా మారి సొంతవైద్యం చేసుకోవద్దు’ అని సూచించారు. కరచాలనం చేసే సంస్కృతిని మాని, మన సంప్రదాయమైన ‘నమస్తే’తో పలుకరించుకోవాలని సూచించారు. ‘మనం కొన్ని కారణాల వల్ల మన సంస్కృతికి దూరమయ్యాం. ఇప్పుడు మళ్లీ మొదలుపెడుదాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం నమస్తే అంటూ పలుకరించుకుంటున్నది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


మీలో ఈశ్వరుడిని చూస్తున్నా

ప్రధాని మోదీ జన్‌ ఔషధి లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటిస్తుండగా.. డెహ్రాడూన్‌కు చెందిన దీపా షా ఆయనను దేవుడితో పోల్చారు. దీప 2011లో పక్షవాతానికి గురయ్యారు. జన్‌ ఔషధి కేంద్రాల వల్ల తనకు మందుల ఖర్చు తగ్గిందని, ప్రతినెల రూ.3,500 వరకు ఆదా అవుతున్నదని ఆమె తెలిపారు. ‘నాకు నయం కావడం కష్టమని డాక్టర్లు చెప్పారు. కానీ మీ గొంతు వింటుంటే నేను కోలుకుంటున్నట్టు అనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు. ‘నేను ఈశ్వరుడిని చూడలేదు. కానీ మీలో శివున్ని చూస్తున్నాను’ అంటూ దీప ఆనందభాష్పాలు రాల్చారు. దీంతో మోదీ భావోద్వేగానికి గురయ్యారు. 


logo