శనివారం 11 జూలై 2020
National - Jun 05, 2020 , 15:33:17

ఆప్ ఎమ్మెల్యే బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ

ఆప్ ఎమ్మెల్యే బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీకి చెందిన డాక్టర్ రాజేందర్‌సింగ్‌ ఆత్మహత్య కార‌ణ‌మ‌య్యాడ‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో జైలుపాలైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌కు తాత్కాలిక బెయిలు మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ప్రకాశ్ జర్వాల్ బెయిలు పిటిషన్‌పై స్పెషల్ జడ్జి సంజీవ్ అగర్వాల్ విచార‌ణ జ‌రిపారు. నిందితుని భార్య, 11 నెలల కుమారుడు కొవిడ్-19తో బాధపడుతున్నార‌నే అనుమానం ఉండటం, నిందితుడి మామ కూడా కొవిడ్-19 కారణంగా మరణించాడ‌నే అనుమానాలు వ్య‌క్తం కావ‌డం లాంటి ప‌రిణామాలను ప‌రిశీలించామ‌ని న్యాయ‌మూర్తి చెప్పారు. 

అయితే నిందితుడు కూడా డాక్టర్ రాజేందర్‌సింగ్‌ నివసించే ప్రాంతంలోనే నివసిస్తుండటం, అంతేగాక‌ ఎమ్మెల్యే కూడా కావడం వల్ల అత‌ను సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడికి తాత్కాలిక బెయిలు మంజూరు చేయ‌లేమంటూ పిటిష‌న్‌ను తిరస్కరించారు. డాక్టర్ రాజేందర్ ఏప్రిల్ 18న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. త‌న‌ ఆత్మహత్యకు ఆప్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ జ‌ర్వాల్, అత‌ని అనుచ‌రుడి వేధింపులే కార‌ణ‌మ‌ని వైద్యుడు సూసైట్ నోట్ రాసిపెట్టడంతో పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 


logo