శనివారం 28 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 01:28:29

5లోగా మాఫీ చేయండి

5లోగా మాఫీ చేయండి

  • చక్రవడ్డీపై అన్ని బ్యాంకులు, రుణ సంస్థలకు ఆర్బీఐ సూచన

ముంబై: ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నవంబర్‌ 5లోగా అమలు చేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అన్ని బ్యాంకులకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు సూచించింది. ఈ ఆరు నెలల (ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆగస్టు 31) కాలంలో సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య తేడా నగదును రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు జారీచేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో గృహ, విద్య, వాహన, ఎంఎస్‌ఎంఈ, గృహోపకరణ, వినిమయ రుణ గ్రహీతలతోపాటు క్రెడిట్‌ కార్డు బకాయిదారులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం చక్రవడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించింది. మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకోని రుణ గ్రహీతలకు కూడా వర్తించే ఈ పథకాన్ని నవంబర్‌ 5లోగా అమలు చేసేందుకు అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చర్యలు చేపట్టాలని ఆర్బీఐ మంగళవారం ఓ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.