మంగళవారం 31 మార్చి 2020
National - Mar 20, 2020 , 12:42:12

నిర్భయ దోషుల తరపున చివరి వరకు ప్రయత్నించాడు

నిర్భయ దోషుల తరపున చివరి వరకు ప్రయత్నించాడు

హైదరాబాద్‌ : నలుగురు దోషుల్లో ఏ ఒక్కరికి ఉరిశిక్ష అమలు జరగనీయనని నిర్భయ తల్లి ఆశాదేవీ వైపు చూస్తూ జనవరి 31వే తేదీన పాటియాలా హౌజ్‌ కోర్టు మెట్లపై సవాల్‌ విసిరాడు ఓ లాయర్‌. అతనే నిర్భయ కేసులో దోషుల తరపున వాదించిన డిఫెన్స్‌ లాయర్‌ ఏపీ.సింగ్‌. ఈ అంశాన్ని ఆశాదేవే చెబుతూ ఇంకెన్నాళ్లు దోషులకు ఉరిశిక్ష అమలు అంటూ బోరున విలపించారు. ఏపీ.సింగ్‌(అజయ్‌ ప్రకాశ్‌ సింగ్‌) లక్నో విశ్వవిద్యాలయం నుంచి లా గ్రాడ్యుయేట్‌లో పట్టా అందుకున్నారు. క్రిమినాలజీలో డాక్టరేట్‌ అందుకున్నారు. 1997 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేస్తున్నారు. 2012 సంవత్సరంలో నిర్భయ కేసులో సాకేత్‌ కోర్టుకు డిఫెన్స్‌ న్యాయవాదిగా వెళ్లి అపఖ్యాతి పాలయ్యాడు. ఇతడి ప్రవర్తనపై బార్‌ కౌన్సిల్‌ పలుమార్లు నోటీసులు జారిచేసింది. న్యాయవ్యవస్థలోని లూప్‌హోల్స్‌ను వాడుకుంటూ కేసును సాగదీస్తున్నందుకుగాను కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ హైకోర్టు ఓసారి హెచ్చరించింది. 

2012 డిసెంబర్‌ 16వ తేదీన దేశ రాజధానిలో మెడికల్‌ విద్యార్థిని దారుణ అత్యాచారానికి గురైంది. బాధితురాలు డిసెంబర్‌ 29న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. దోషులకు కఠిన శిక్షలు అమలుచేసేందుకు దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో కేంద్రం నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటు చేసింది. 2013 సెప్టెంబర్‌ 13వ తేదీన ట్రయల్‌ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తొలిసారిగా తీర్పును వెలువరించింది. ఇగ అక్కడి నుంచి కథ మొదలైంది. నొటోరియస్‌ క్రిమినల్స్‌ కేసులు వాదించే సుప్రీం లాయర్‌ ఏపీ.సింగ్‌ దోషుల తరపున బరిలోకి దిగారు. 

నిందితుల వారిగా దిగువకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రివ్యూ పిటిషన్‌, క్యురేటివ్‌ పిటిషన్‌, క్షమాభిక్ష పిటిషన్‌ ఇన్ని రకాలుగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరి అమలును వాయిదా వేయిస్తూ వచ్చారు. క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించాక కూడా మళ్లీ దిగువ కోర్టుల్లో ఉరిశిక్షపై స్టే కోసం పిటిషన్లు వేశారు. మన చట్టాల్లో ఉన్న లొసుగుల్ని సమగ్రంగా అధ్యయనం చేసి ఈ కేసులో ముప్పుతిప్పలు పెట్టారు. కోర్టులో నిర్భయ రేపిస్టులకు ఉరిశిక్ష వాయిదా పడ్డ ప్రతీసారి దేశమంతా మన న్యాయవ్యవస్థ తీరూ.. మన చట్టాల అసహాయతను తిట్టిపోశారు. అసలు నిర్భయ రేపిస్టులకు అనుకూలంగా వాదిస్తున్న లాయర్లను ఉరితీయాలంటూ డిమాండ్‌ చేసినవాళ్లు సైతం ఉన్నారు. మొత్తంమీద 2012 డిసెంబర్‌ 16న చోటుచేసుకున్న నిర్భయ కేసు కొనసా....గుతూ వచ్చి దోషులకు ఉరి అమలుతో నేటితో ముగిసింది. 


logo
>>>>>>