గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 18:39:39

ఏపీలో మూడు రాజ‌ధానుల బిల్లుకు మ‌రోసారి అసెంబ్లీ ఆమోదం

ఏపీలో మూడు రాజ‌ధానుల బిల్లుకు మ‌రోసారి అసెంబ్లీ ఆమోదం

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ళ్లీ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి ఆమోద‌ముద్ర వేసింది. మూడు రాజధానుల ఏర్పాటు శాసనప్రక్రియ దశలో ఉందని అంత‌కుముందు ఏపీ గ‌వ‌ర్న‌ర్ త‌న ప్రసంగంలో పేర్కొన్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించారు. ఐతే మండలిలో దీనికి బ్రేకులు పడ్డాయి. మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లును ఇప్పుడు అసెంబ్లీ మ‌రోసారి ఆమోదించింది. 

మూడు రాజ‌ధానుల బిల్లుతోపాటు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లుల‌పై గత అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చ జరిగినందున.. ఇప్పుడు ఎలాంటి చర్చ లేకుండానే ఆ బిల్లుల‌ను ఆమోదించారు.  అదేవిధంగా దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సైతం అసెంబ్లీ ఆమోదించింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. 


logo