శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 02:24:00

కశ్మీర్లో భూములను ఎవరైనా కొనొచ్చు!

కశ్మీర్లో భూములను ఎవరైనా కొనొచ్చు!

  • చట్టాలను సవరించిన కేంద్రప్రభుత్వం
  • సరిహద్దు యూటీలో ఇక భారీఎత్తున భూ విక్రయాలు!

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని భూములను ఎవరైనా కొనుగోలు చేసేందుకు అనుమతించేలా పలు చట్టాలకు కేంద్రప్రభుత్వం సవరణలు చేసింది. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి చట్టం, సెక్షన్‌ 17లోని ‘రాష్ట్రంలోని శాశ్వత నివాసి’ అనే పదాలను తొలగించింది. దీంతో కశ్మీర్‌లోని భూములను దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమైంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన దాదాపు ఏడాది తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గతంలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం వల్ల బయటి వ్యక్తులు ఎవరూ అక్కడి భూములను కొనుగోలు చేయడానికి వీలు ఉండేది కాదు. తాజా నిర్ణయంతో బయటి వ్యక్తులు జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)లో  పెద్దఎత్తున భూముల కొనుగోళ్లు జరిపే అవకాశమున్నదని మాజీ అడ్వకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇషాక్‌ ఖాద్రీ తెలిపారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఓమర్‌ అబ్దుల్లా మండిపడ్డారు.కశ్మీర్‌ చట్టాలను సవరించడాన్ని తీవ్రంగా ఖండించారు. జమ్ముకశ్మీర్‌ను ఇప్పుడు అందరికీ అమ్మకానికి పెట్టినట్టు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.