ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:13:52

ఇండిగో ఎంప్లాయీస్ కు మరో షాక్

 ఇండిగో ఎంప్లాయీస్ కు మరో షాక్

ఢిల్లీ : కరోనా కారణంగా విమాన సర్వీసులు రెండు నెలల పాటు నిలిపివేశారు. మే 25న తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు 250 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా, ప్రస్తుతం ఇందులో కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. కోవిడ్ -19 ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో టూరిజం, హోటల్స్ అండ్ రెస్టారెంట్‌తో పాటు విమానయానం ఉన్నది. ఈ రంగాల్లోనే ఎక్కువగా ఉద్యోగాల కోత, వేతన కోతలు కనిపించాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో రెండోసారి వేతనకోతను ప్రకటించింది. ఇదివరకు మొదటిసారి వేతన కోత విధించింది. ఇప్పుడు రెండో రౌండ్ భారీ వేతన కోతలను ప్రకటించింది. సీనియర్ ఉద్యోగులకు 35 శాతం వరకు వేతన కోత అమలు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.

నగదు చెల్లింపులు తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదివరకు మే నెలలో సీనియర్ ఉద్యోగులకు 25 శాతం వేతన కోత అమలు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే కరోనా కారణంగా 10 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్లు జూలై 20వ తేదీన ప్రకటించింది. ఇప్పుడు సీనియర్ ఉద్యోగులకు వేతన కోతను 35 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా ఈ-మెయిల్ పంపించారు. సీఈవో వేతనంలోను 35 శాతం కోత ఉంటుంది. తన వేతనంలో 35 శాతం కోత విధించుకుంటున్నానని, అందరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అంతకుమించి హోదాల్లో ఉన్నవారు 30 శాతం వేతన కోతకు అంగీకరించాలని కోరారు.

పైలట్లకు వేతన కోతను 28 శాతానికి పెంచామని, వైస్ ప్రెసిడెంట్స్‌కు 25 శాతం, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్‌కు 15 శాతం వేతన కోత విధిస్తున్నట్లు తెలిపారు. ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ఏ, బీ విభాగాల ఉద్యోగులకు కోత విధించలేదు. ప్రతి నెలలో ఉద్యోగులకు వేతనం లేని సెలవులను 5 రోజులు తప్పనిసరి చేశారు. ఈ ప్రకటన మే నెలలో చేశారు. దీనిని ఆగస్టు లో రెండింతలు చేశారు. వచ్చే నెల నుండి వేతనం లేని సెలవులను 10.5 రోజులకు పెంచుతోంది. ప్రస్తుతానికి ఇందులో మార్పులు చేయలేదని, పని భారానికి అనుగుణంగా ఆయా విభాగాలు, సిబ్బందికి సెప్టెంబర్ నుండి ఎంత మేర వేతనం లేని సెలవులు ఇవ్వాలో నిర్ణయిస్తామని తెలిపారు. 


logo