గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 01:33:27

మనలో మరో అవయవం

మనలో మరో అవయవం

  • గొంతు పైభాగంలో గుర్తించిన నెదర్లాండ్స్‌ పరిశోధకులు 
  • లాలాజల గ్రంథుల వెనుక దాగిన మరో గ్రంథి
  • ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు చికిత్స చేస్తుండగా బహిర్గతం
  • గొట్టపు లాలాజల గ్రంథులుగా నామకరణం

న్యూఢిల్లీ: మనిషి దేహం అనంత విశ్వం లాంటిది. ఎంత శోధించినా విశ్వంలో ఏదో ఒక రహస్యం ఉంటూనే ఉంటుంది. అలాగే మనిషి దేహంలోనూ మన శాస్త్ర విజ్ఞానం గుర్తించని రహస్యాలూ ఉన్నాయి. మనిషి దేహంలో ఎన్ని అవయవాలున్నాయి అనే ప్రశ్నకు ఇప్పటికీ సర్వామోదమైన సమాధానం చెప్పలేకపోయారు పరిశోధకులు. అయితే అందరూ అంగీకరించిన అవయవాలు 79 ఉన్నాయి. ప్రత్యేక అవయవంగా గుర్తించాలా వద్దా అన్న మీమాంస నడుస్తున్నవి మరో 20 దాకా ఉన్నాయి. ఇంతటితో అయిపోలేదు. ఎక్స్‌రేలు, స్కానింగ్‌లతో మనిషి దేహాన్ని ఆమూలాగ్రం శోధించాం కదా ఇంకా కొత్తది ఏదీ లేదు అని భావిస్తున్న శాస్త్ర ప్రపంచానికి నెదర్లాండ్స్‌ పరిశోధకులు పెద్ద షాకిచ్చారు. మనిషి తలలో మనం ఇప్పటివరకు గుర్తించని ఓ కొత్త అవయవం దాగి ఉన్నదని ప్రకటించారు.

గ్రంథుల వెనుక మరో గ్రంథి

నాలుక కింద, దవడ కింద, దవడ వెనుక భాగంలో ఒక్కొక్కటి చొప్పున లాలాజల గ్రంథులు ఉంటాయి. కానీ, గొంతు లోపల పైభాగంలో లాలాజల గ్రంథుల వెనుక మరో  కొత్త గ్రంథి ఉంది. నెదర్లాండ్‌ పరిశోధకులు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌పై పరిశోధన చేస్తుండగా అనుకోకుండా ఇది వారి కంట పడింది. ఒకటిన్నర ఇంచుల పొడవున్న ఆ గ్రంథికి ‘గొట్టపు లాలాజల గ్రంథి’ అని పేరు పెట్టారు. ముక్కు, నోరు వెనుక గొంతు లోపలి భాగంలో టోరస్‌ టుబేరియస్‌ అనే భాగంలో ఈ గ్రంథి ఉన్నది. గొంతు తడిగా ఉండటానికి లాలాజల గ్రంథులే కారణమని ఇంతకాలం భావిస్తున్నారు. కానీ, తాజాగా గుర్తించిన గ్రంథి వల్లనే గొంతు తడిగా, జిగటగా ఉంటున్నదని ‘రేడియోథెరపీ అండ్‌ అంకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన పత్రం వెల్లడించింది. 

క్యాన్సర్‌ చికిత్సలో కొత్త మలుపు

తాజా పరిశోధనతో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో చాలా మార్పులు వస్తాయని నెదర్లాండ్స్‌ అంకాలజిస్టు ఊటర్‌ ఒగెల్‌ తెలిపారు. క్యాన్సర్‌ చికిత్సలో రేడియోథెరపీ నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో లాలాజల గ్రంథులు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇకపై, కొత్త గ్రంథిని కూడా ఎలా కాపాడాలన్నదానిపై దృష్టి పెడుతామని వెల్లడించారు.