బుధవారం 28 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 07:27:31

యూపీలో మరో ‘హత్రాస్‌’.. 22 ఏండ్ల మహిళపై గ్యాంగ్‌ రేప్‌

యూపీలో మరో ‘హత్రాస్‌’.. 22 ఏండ్ల మహిళపై గ్యాంగ్‌ రేప్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై లైంగికదాడుల పరంపర కొనసాగుతున్నది. హత్రాస్‌ ఘటన మరవక ముందే అదే రాష్ట్రంలో మరో అత్యాచారం చోటుచేసుకుంది. దేశం మొత్తం హత్రాస్‌ యువతిని అర్ధరాత్రి దహణం చేయడంపై దృష్టికేంద్రీకరించినవేళ, హత్రాస్‌ 500 కి.మీ. దూరంలో మరో యువతి సామూహిక లైంగిక దాడి అంశం మరుగున పడిపోయింది. 

బల్‌రామ్‌పూర్‌కు చెందిన ఓ దళిత మహిళ రోజులానే నిన్న కూడా పనికి వెల్లింది. అయితే సమయానికి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్‌ బాటిల్‌తో ఈ-రిక్షాలో ఇంటికి చేరింది. తనకు కడుపులో ఏదో కాలిపోతున్నట్లు ఉందని, నడవలేనని తల్లికి చెప్పింది. తనను రక్షించాలను, తనకు చావాలని లేదని ఏడుస్తూ తన తల్లిని బతిమాలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. 

అక్కడ పరిశీలించిన డాక్టర్‌ ఆమె పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆకరి క్షణాల్లో ఉన్న ఆమెను లక్నోకు తీసుకెళ్తుండగా, బల్‌రామ్‌పూర్‌ నగరం దాటకముందే తుదిశ్వాస విడిచింది. ఆమెకు పోస్టుమార్టం చేయగా, ఆమెకు మత్తు మందు ఇచ్చారని, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రిపోర్టులో తేలింది. మృగాళ్లు ఆమె నడుమును విరచడంతోపాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని డాక్టర్లు వెల్లడించారు.  

తన బిడ్డ ఇంటికి తిరిగివచ్చినప్పుడు పూర్తిగా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉందని.. కడుపులో తీవ్రమైన మంటగా ఉందని చెప్పినట్లు ఆమె తల్లి తెలిపింది. తనకు చావాలని లేదని, రక్షించాలని ప్రాదేయపడిందని పేర్కొంది. కాగా, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, నిందితులను అరెస్టు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.    


logo