మంగళవారం 14 జూలై 2020
National - Jun 25, 2020 , 08:22:17

మరో ఏనుగు మృతి

మరో ఏనుగు మృతి

చిత్తూరు: కేరళ రాష్ట్రంలో నోట్లో క్రాకర్స్‌  ఉంచి  ఓ ఏనుగును చంపిన దుండగుల ఉదంతం మరిచిపోక ముందే చిత్తూరు జిల్లాలో మరో ఏనుగు మృత్యువాత పడింది. అయితే ఈ ఏనుగు బండరాయి నుంచి జారిపడిందా ? ఏనుగుల  మధ్య జరిగిన దాడుల్లో గాయపడి మృతి చెందిందా అనే విషయాన్ని అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం  కేసిపెంట గ్రామ అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి.  రెండు రోజుల క్రితం  అటవీప్రాంతం నుంచి ఏనుగు శరీరం కుళ్లిపోయి వాసన వస్తుండడంతో అటువైపు వెళ్లిన పశువుల కాపరులు ఏనుగు కళేబరాన్ని గమనించారు. పశువుల కాపారులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని ఏనుగు కళేబరాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

అధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జంతు  ప్రదర్శనశాల వైద్యుడు తోయిబా సింగ్‌  సంఘటన స్థలానికి చేరుకుని ఏనుగు కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఏనుగు చనిపోవడానికి గల కారణాలు వైద్యులు అందించే నివేదికను బట్టి నిజాలు తెలుస్తాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. 


logo