ఆదివారం 07 జూన్ 2020
National - Mar 31, 2020 , 16:21:17

మరో మొహల్లా డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌

మరో మొహల్లా డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మరో మొహల్లా క్లినిక్‌ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఢిల్లీలోని బాబర్‌పూర్‌ ఏరియాలోని మొహల్లా క్లినిక్‌లో పని చేస్తున్న వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఈ వైద్యుడు ఇతర దేశాలకు వెళ్లి రాలేదు. కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఎవరో ఈ వైద్యుడి దగ్గర వైద్యం చేయించుకుని ఉంటాడని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

గత వారం మౌజ్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్‌లో పని చేస్తున్న వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. ఈ వైద్యుడితో పాటు ఆయన భార్య, కూతురికి కూడా కరోనా సోకింది. దీంతో మౌజ్‌పూర్‌ క్లినిక్‌కు మార్చి 12 నుంచి 15వ తేదీ మధ్యలో వచ్చిన 900 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచాలని ఉన్నతాధికారులు సూచించారు. మౌజ్‌పూర్‌ ఏరియా క్లినిక్‌కు బాబర్‌పూర్‌ క్లినిక్‌కు మధ్య దూరం కిలోమీటర్‌ మాత్రమే.

ఢిల్లీలో గడిచిన రెండు రోజుల్లో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా, ఢిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 100 దాటింది. ఢిల్లీలోని మర్కజ్‌ భవనాన్ని శానిటైజేషన్‌ చేశారు. ఈ భవనంలో మత ప్రార్థనలకు హాజరైన వారిలో 24 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 334 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా, 700 మందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించింది ఢిల్లీ ప్రభుత్వం.


logo