గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 11:50:27

ఏడు రంగాలకు నేడు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటన

ఏడు రంగాలకు నేడు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటన

ఢిల్లీ : కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ వివరాలను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడతలవారీగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆర్థిక ప్యాకేజీలోని చివరి విడత, ప్యాకేజీ-5 వివరాలను ఆమె వెల్లడించారు. ప్యాకేజీ-5లో భాగంగా కేంద్రం ఏడు రంగాలపై దృష్టి సారించింది. 1. ఉపాధి హామీ. 2.ఆరోగ్యం, విద్యానుబంధ రంగాలు. 3. వ్యాపారాలు, కోవిడ్‌. 4. డీక్రిమినలైజేషన్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యాక్ట్‌. 5. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌. 6. పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పాలసీ. 7. రాష్ట్ర ప్రభుత్వాలు-వనరులు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ..  ఒక దేశంగా మనం చాలా కీలకమైన దశలో నిలబడ్డామన్నారు ఇంత పెద్ద విపత్తు భారతదేశానికి ఒక ఛాలెంజ్‌ను ఒక అవకాశాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా జీవనం, జీవనోపాధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. భూములు, శ్రామిక శక్తి, నగదు నిల్వలు, చట్టాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఛాలెంజ్‌కు తీసుకుని దేశాన్ని స్వయం సంవృద్ధి దిశగా నడిపించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని తాము అవకాశంగా మలుచుకుంటున్నట్లు తెలిపారు.

పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. వచ్చే మూడు నెలలు నిత్యావసరాలు అందిస్తామని ఇప్పటికే తెలిపామన్నారు. ఇప్పటికే 8.19 కోట్ల మంది రైతులకు నేరుగా రూ. 2 వేలు చొప్పున ఇచ్చామన్నారు. రైతులకు మొత్తం రూ. 3 వేల కోట్లు అందజేసినట్లు తెలిపారు. జన్‌ధన్‌ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ జరిగిందన్నారు. మహిళలకు మొత్తం రూ.10,025 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2.2 కోట్ల మంది నిర్మాణరంగ కూలీలకు రూ.3,950 కోట్లు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఉజ్వల పథకం కింద 6.81 కోట్ల ఉచిత గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు. 


logo