శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 13:04:47

వైద్య సదుపాయల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు

వైద్య సదుపాయల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు

ఢిల్లీ : కోవిడ్‌-19 నేపథ్యంలో దేశవ్యాప్త వైద్య సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటికే రూ. 15 వేల కోట్లు ప్రకటించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-5 వివరాలను ఆమె నేడు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వైద్య సదుపాయాల కోసం రూ.4,113 కోట్లు రాష్ర్టాలకు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా టెస్టు కిట్లు, తదితర అవసరమైన వస్తువుల కోసం రూ. 3,750 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కిట్స్‌ల కోసం మరో రూ. 550 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనే 300 కు పైగా పీపీఈ కిట్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఆరోగ్యరంగంలో పనిచేసే సిబ్బందికి రూ. 50 లక్షల చొప్పున బీమా కల్పించామన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టాలకు 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్‌-95 మాస్కులు, 11 కోట్లకు పైగా హైడ్రో క్లోరోక్విన్‌ మాత్రలను సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి పరచడం. ల్యాబ్‌ నెట్‌వర్క్స్‌ను పటిష్ట పరచడం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్‌ అనుభవాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ సంక్షోభాలు ఎదుర్కొనేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్‌ ద్వారా అదనపు నిధులు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.


logo