బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 15:07:20

ముంగర్‌లో తారాస్థాయికి హింస : ఎస్పీని తప్పించిన ఈసీ

ముంగర్‌లో తారాస్థాయికి హింస : ఎస్పీని తప్పించిన ఈసీ

పాట్నా : బిహార్‌లోని ముంగర్‌లో గురువారం హింస చెలరేగింది. ఆగ్రహంతో ఉన్న గుంపు బసుదేవ్‌పూర్ పోలీసు పోస్టుకు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ఆందోళనాకారులు ప్రస్తుతం గ్రామీణ పోలీస్ స్టేషన్‌ వైపు బయలుదేరినట్లు సమాచారం. కాగా, ముంగర్‌లో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్‌.. జిల్లా ఎస్పీని విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.

సోమవారం దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఘర్షణ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులపై కోపం వ్యక్తం చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి బీభత్సం సృష్టించారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు అవుట్‌ పోస్టును దహనం చేశారు. ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్నందున ముంగర్‌లో భద్రతా దళాలు ముంగర్‌ నుంచి బయటకు వెళ్లిపోగానే.. ఆందోళనాకారులు రెచ్చిపోయినట్లు తెలుస్తున్నది. ఎస్పీ కార్యాలయం వద్ద 25-30 వేల మంది జనం గుమిగూడి ధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్ళు విసిరారు. వాహనాల అద్దాలు పగులగొట్టి సారై మండి వద్ద రోడ్డుపై టైర్లు వేసి మంట పెట్టారు. అక్కడికి సమీపంలోని న్యాయమూర్తి బంగ్లా వద్ద కూడా జనం రాళ్ళు రువ్వినట్లు సమాచారం. నిమజ్జనం రోజు రాత్రి జరిగిన హింసాకాండలో గాయపడిన వారిలో ఒక పిల్లవాడు మరణించినట్లు వార్తలు వచ్చాయని వర్గాలు తెలిపాయి. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ముంగర్‌లో పరిస్థితి మరింత దిగజారిందని ఏడీజీ జితేంద్ర కుమార్‌ తెలిపారు. సోమవారం నాటి ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇలాఉండగా, ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంగర్‌ ఎస్పీని ఎన్నికల కమిషన్‌ విధుల నుంచి తప్పించింది.

ముంగర్‌ పట్టణంలోని దీన్‌దయాల్ ఉపాధ్యాయ చౌక్ వద్ద సోమవారం రాత్రి దేవీ విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో భక్తులు-పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితి చేజారకుండా చూశారు. ఈ ఘర్షణలో ఒకరు చనిపోగా దాదాపు 20 మంది పోలీసులు గాయపట్లు వార్తలు వచ్చాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.