ఇంటిపైకెక్కిన స్కార్పియో.. సంతోషపడిన ఆనంద్‌ మహీంద్రా

Oct 31, 2020 , 21:10:58

పాట్నా : తమకు అత్యంత ఇష్టమైన వస్తువులను కండ్ల ముందే ఉంచేకోవడానికి చాలా మంది ఉబలాటపడుతుంటారు. కొన్నివస్తువులపై వాటిపై తమకుండే ప్రేమను కొత్త రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. కొందరు గోవులను ఇంటి పైభాగంలో బొమ్మలుగా అలంకరించుకోగా.. మరికొందరు తమకిష్టమైన కార్లు, విమానాలు, చేపలు.. ఇలా రకరకాల ఆకృతుల్లో వాటర్‌ ట్యాంకర్లను నిర్మించుకుని సంతోషపడుతుంటారు. అలాంటి కోవకు చెందిన ఓ స్కార్పియో వాటర్‌ ట్యాంకర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. కంపెనీ యజమాని అయిన ఆనంద్‌ మహీంద్ర చెప్పలేనంత సంతోషం పొందారు.

బిహార్ రాష్ట్రంలోని భాగల్పూర్‌కు చెందిన అమన్ అనే వ్యక్తి తన మొదటి కారుగా మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేశాడు. దానిపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకోవడానికి తాను నిర్మించుకున్న భవనంపైన అదే ఆకారంలో వాటర్ ట్యాంకర్‌ను సిద్ధం చేశాడు. దీని కోసం సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు. స్కార్పియో వాటర్ ట్యాంక్  అచ్చం కారు మాదిరిగానే ఉండటంతో పలువుర్ని విశేషంగా ఆకర్శిస్తున్నది. దారెంట పోయే ప్రతి ఒక్కరూ ఈ వాహనాన్ని చూసి ఇంటి యజమానిని శహబాష్‌ అనకుండా ఉండలేరంటే.. ఎంత నాచురాల్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కార్పియో వాటర్ ట్యాంక్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆలోచనను ఎంతగానో ఇష్టపడ్డారు. "స్కార్పియో పైకప్పుకు పెరిగింది. ఆ ఇంటి వారికి నా సలామ్‌. యజమానికి ప్రశంసలు. అతడి తొలి కారు పట్ల ఆయనకున్న అభిమానానికి మేం వందనం చేయలేకుండా ఉండలేం!" అని ట్విట్టర్‌లో ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD