బుధవారం 03 జూన్ 2020
National - Apr 01, 2020 , 13:42:49

పెన్ష‌న్ డ‌బ్బుల్లోంచి రూ.ల‌క్ష విరాళం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వృద్ధురాలి దాతృత్వం

పెన్ష‌న్ డ‌బ్బుల్లోంచి రూ.ల‌క్ష విరాళం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వృద్ధురాలి దాతృత్వం

భోపాల్‌: క‌రోనాపై పోరు కోసం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ వృద్ధురాలు త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. విదిశ జిల్లాలోని అరిహంత్ విహార్‌కు చెందిన స‌ల్బా ఉస్క‌ర్ రిటైర్డ్ ఉద్యోగిని. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 82 ఏండ్లు. నెల‌నెలా వ‌చ్చే పెన్ష‌న్ డ‌బ్బుల‌తో ఆమె జీవ‌నం గ‌డుపుతున్నారు. మిగిలిన సొమ్మును పొదుపు చేసుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల క‌రోనా ర‌క్క‌సి విజృంభించ‌డంతో త‌న వంతు సాయం చేయాల‌నుకున్నారు. 

అనుక‌న్న‌దే త‌డ‌వుగా త‌న పెన్ష‌న్ డ‌బ్బుల్లోంచి ల‌క్ష రూపాయ‌లు దానం చేశారు. ఈ మేర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్‌ను అంద‌జేశారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూసి త‌న వంతుగా ఏదైనా సాయం చేయాల‌నుకున్నాన‌ని, ఆ మేర‌కే ఇప్పుడు ల‌క్ష రూపాయ‌లు విరాళంగా ఇచ్చాన‌ని స‌ల్బా ఉస్క‌ర్ చెప్పారు. అంద‌రూ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించి క‌రోనా మ‌హ‌మ్మారిని పార‌దోలాల‌ని, ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ధిక్క‌రించ‌వ‌ద్ద‌ని సూచించారు. 

ఇదిలావుంటే, స‌ల్బా ఉస్క‌ర్ విశాల మ‌న‌స్త‌త్వానికి మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ ఫిదా అయ్యారు. మా తుజే స‌లామ్ (త‌ల్లీ నీకు వంద‌నం) అని ప్ర‌శంసిస్తూ ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు. ల‌క్ష రూపాయ‌ల విరాళంతో ఆ త‌ల్లి అందించిన ఆశీస్సులు క‌రోనాపై పోరాటంలో త‌మ విశ్వ‌సాన్ని మ‌రింత రెట్టింపు చేశాయ‌ని శివ‌రాజ్ కొనియాడారు. 


logo