ఆదివారం 24 జనవరి 2021
National - Dec 03, 2020 , 01:22:40

అబద్ధాల అమిత్‌లు

అబద్ధాల అమిత్‌లు

  • సోషల్‌ మీడియాలో బట్టలిప్పేసిన బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌
  • రైతుపై దాడిని తప్పుగా చిత్రీకరించిన అమిత్‌ మాలవీయ
  • నిజాన్ని బయటపెట్టిన ట్విట్టర్‌ సంస్థ
  • అతగాడి ట్వీట్‌కు ‘మ్యానిపులేటెడ్‌ మీడియా’ ట్యాగ్‌
  • దేశంలోనే తొలిసారి దొరికిన వ్యక్తి ఈయనే
  • 16 సార్లు ఫేక్‌ పోస్టులు పెట్టినట్టు రుజువు
  • గతంలోనూ ఫేస్‌బుక్‌తో బీజేపీ కుమ్మక్కు!
  • సుద్దపూసలం అంటూ కల్లబొల్లి మాటలు

అబద్ధాల పిట్ట దొరికింది.. లొసుగుల పుట్ట కదిలింది.. బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవీయ బండారం బట్టబయలైంది.. ఇంతకాలం అబద్ధాలను నిజమని నమ్మిస్తూ వచ్చిన అమిత్‌.. ఈసారి భంగపడ్డాడు. మార్ఫింగ్‌ వీడియో పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. అతగాడు చెప్పేది అబద్ధం, చెప్పించేది అబద్ధం. పీల్చే శ్వాస కూడా అబద్ధమే. అబద్ధాలనే ఆహారంగా తీసుకొంటాడు. నీచాతినీచమైన ఆలోచనలతో దేశ యువత మనసుల్లో విద్వేషం నింపిన మాలవీయ.. గోబెల్స్‌ను మించి దుర్మార్గంగా ఆలోచించి అబద్ధాల పునాదులపై రాజకీయ మేడ కట్టుకొనేందుకు జవాన్లను, రైతులను కూడా ఉపయోగించుకొంటున్నాడు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీకి ఒకటే పని.. ఫేక్‌ వార్తలతో ప్రజలను మోసంచేయడం. సోషల్‌ మీడియాను వాడుకొని తప్పుడు పోస్టులు, తప్పుడు వార్తలతో పక్కదారి పట్టించడం. అబద్ధపు ప్రచారంతో తిమ్మిని బమ్మి చేయడం. ఎన్నికలు వచ్చినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినా ఫేకుడు కమలరాజాలు నిద్రలేస్తారు. తాజాగా, రైతుల ఆందోళనను సైతం తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, అడ్డంగా దొరికిపోయారు. అన్నం పెట్టే అన్నదాతపైనే సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారంచేసినందుకు ట్విట్టర్‌ సంస్థ  బజారుకీడ్చింది. నిజాన్ని చెప్పి బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది. అబద్ధాల సృష్టిలో నంబర్‌వన్‌ అయిన బీజేపీ ఐటీ సెల్‌ ఇంచార్జి అమిత్‌ మాలవీయ.. సీఏఏ ఆందోళన మొదలుకొని, రైతుల ఉద్యమం వరకు అన్నింటినీ ఫేక్‌ చేసేశాడు. తాజాగా, మరోసారి సోషల్‌ మీడియా వేదికగా కల్లిబొల్లి మాటలు, ఖరాబ్‌ కూతలు కూసి కాలుజారిపడ్డాడు. తమ బతుకు కోసం వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతును హేళనచేశాడు. ఓ జవాను ఆందోళనచేస్తున్న రైతును లాఠీతో కొడుతున్న ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. సాధారణ ప్రజానీకానికి కూడా రక్తం ఉడికేలా చేసిందా ఫొటో. బీజేపీ అసలు రంగును బట్టబయలు చేసిందా ఫొటో. కానీ, అది తప్పుడు పోస్ట్‌ అంటూ తనకే సాధ్యమైన ఫేక్‌ వార్తను సృష్టించాడు అమిత్‌ మాలవీయ. రైతును కొడుతున్న ఫొటో.. సృష్టించినదని, అసలు రైతును ఆ జవాను ముట్టుకోలేదంటూ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడీ ఈ ఫేక్‌ ఫ్యాక్ట్‌ చెకర్‌. ఇది ఎంతవరకు నిజమో! అని ట్విట్టర్‌ బృందం పరిశీలించగా ఫేక్‌ అని తేలింది. వెంటనే ఆ పోస్ట్‌కు మోసపూరిత పోస్ట్‌ అన్నట్టు ‘మ్యానిపులేటెడ్‌ మీడియా’ అని ట్యాగ్‌ పెట్టి మాలవీయ, బీజేపీ నీచబుద్ధిని బట్టబయలు చేసింది. దేశం ముందు దోషిగా నిల్చోబెట్టింది. రైతును జవాను కొట్టిన వీడియోను మార్ఫింగ్‌చేసి ట్వీట్‌చేశారని చెంప ఛెళ్లుమనిపించింది. నిజానికి బీజేపీకి ఫేక్‌ వార్తలను సృష్టించడం కొత్తకాదు. ఎన్నో సందర్భాల్లో, ఎంతోమందిని మోసంచేసింది. మొన్నకి మొన్న తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ తమవేనని తప్పుడు ప్రచారం చేసుకొన్నది. అంతా మేమే చేస్తున్నాం, అన్నీ మేమే ఇస్తున్నాం.. అన్నట్టు సోషల్‌ మీడియాలో ఫేక్‌లు సృష్టించింది.

బీజేపీ బాగోతాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత

అమిత్‌ మాలవియా ట్వీట్‌కు మ్యానిపులేటెడ్‌ మీడియా అన్న ట్యాగ్‌ పడగానే, దాన్ని గుర్తించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీ అసలు రంగు ఇదీ అని ప్రజలకు తెలిపారు. ‘బీజేపీ ఐటీ సెల్‌ నేత ట్వీట్‌ను ట్విట్టర్‌ ఫ్లాగింగ్‌ చేసింది. తప్పుడు ట్వీట్‌ను మ్యానిపులేటెడ్‌ మీడియా అని ట్యాగ్‌ వేసింది. ఒకరోజు.. బీజేపీ ప్రచారం చేస్తున్న అన్ని తప్పులను నిజం గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.


ట్విట్టర్‌కు దొరికిన తొలి మలినం

భారతదేశంలోనే తొలిసారి ట్విట్టర్‌కు దొరికిన తొలి ఫేక్‌రాజా.. అమిత్‌ మాలవియా. అమెరికా తర్వాత భారత్‌లో తొలిసారి బుధవారం ఫ్యాక్ట్‌ చెకర్‌ను ట్విట్టర్‌ అందుబాటులోకి తెచ్చింది. ఏది తప్పు, ఏది నిజం.. అన్నది యూజర్లకు తెలియాలన్న సదుద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది. అమిత్‌ మాలవీయ చేసిన ట్వీట్‌ వైరల్‌ కావడంతో అందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలుసుకొన్న ఆ సంస్థ.. ఎడిటెడ్‌ వీడియో అని గ్రహించింది. ఎడిట్‌చేసిన వీడియో అని అమిత్‌ ట్వీట్‌కు మ్యానిపులేటెడ్‌ మీడియా అని ట్యాగ్‌ పెట్టేసింది.


ఎవరీ అమిత్‌ మాలవీయ..

బీజేపీ ఐటీ సెల్‌ నేషనల్‌ ఇంచార్జి ఈయన. ఉత్తరప్రదేశ్‌లోని దయాల్‌బాగ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీబీఎం పూర్తి చేసిన అమిత్‌.. పలు బ్యాంకుల్లో బిజినెస్‌ అనలిస్టుగా పనిచేశాడు. 2015లో బీజేపీ ఐటీ సెల్‌ జాతీయ ఇంచార్జిగా వచ్చాడు. అంతకుముందే 2009లో ఫోరం ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ క్యాంపెయిన్‌ నిర్వహించి, మేధావి వర్గాన్ని బీజేపీలో చేరేలా ప్రోత్సహించాడు. బీజేపీ ఐటీ సెల్‌ బాధ్యతలు చేపట్టాక అబద్ధాలే ప్రచారాస్ర్తాలుగా సోషల్‌ మీడియాలో రెచ్చిపోయాడు. అది పార్టీకి బాగా కలిసివచ్చింది. దాంతో ఫేక్‌ న్యూసే ఆధారంగా బీజేపీ దూసుకుపోయింది. ఇదే నిజం అని నమ్మే స్థాయిలో సాగింది ఆ పార్టీ దుష్ప్రచారం. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ కో-ఇంచార్జిగా అమిత్‌ను నియమించింది. ఫేక్‌ న్యూస్‌తో ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహం పన్నుతున్నారు. బీహార్‌ ఎన్నికల్లోనూ ఇదే పనిచేశారు.

గతంలోనూ ఫేస్‌బుక్‌తో కుమ్మక్కు!

ఎన్నికల్లో గెలవడానికి ఫేక్‌ వార్తలను ప్రచారం చేసేందుకు ఫేస్‌బుక్‌తో బీజేపీ చేతులు కట్టిందని అమెరికా ప్రముఖ వార్తాపత్రిక ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. బీజేపీకి సహకరించేలా పోస్టులను ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేసినట్టు వెల్లడించింది. ఆ పార్టీ నేతలు మాట్లాడిన స్పీచ్‌లను ఎక్కువగా ప్రమోట్‌ చేసినట్టు వివరించింది. గొడ్డు మాంసం తింటే ముస్లింలను చంపేస్తానని బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌ ఫ్లాగ్‌ మాత్రమే చేసింది. కానీ బ్యాన్‌ విధించలేదని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఉదహరించింది.

పైకి సత్తెపూస.. కానీ

తప్పుడు ప్రచారంతో ప్రజలను నమ్మించి, ప్రత్యర్థి పార్టీలను పడగొట్టే బీజేపీ పైకి మాత్రం నిజాయితీపరులం అన్నట్టు బిల్డప్‌ ఇస్తుంది. తాజాగా ఆ పార్టీ నేత, కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు అద్దం పడుతాయి. టీఆర్‌ఎస్‌ ఫేక్‌ వార్తలను ప్రచారం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మరిప్పుడు ఫేక్‌ వార్తలను సృష్టించేది ఎవరు? ప్రచారం చేసేది ఎవరు? అన్నది ప్రజలకు అర్థమైపోయినట్టే.

- సెంట్రల్‌ డెస్క్‌

16 పరమ అబద్ధాలు..

1. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా ఆందోళనకారులు పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని అరిచినట్టు ఒక వీడియోను అమిత్‌ మాలవీయ పోస్ట్‌ చేశారు. కానీ, అది నిజం కాదని తేలింది.

2. హిందువులకు వ్యతిరేకంగా అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు నినాదాలు చేసినట్టు అమిత్‌ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టారు. అదీ ఫేక్‌ అని వెల్లడైంది.

3. సీఏఏపై ది వైర్‌ జర్నలిస్టు అర్ఫా ఖానుమ్‌ చేసిన స్పీచ్‌ను కూడా మార్ఫింగ్‌ చేయించి పోస్ట్‌ చేశాడీ ఘనుడు.

4. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తన సోదరితో ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మాలవీయ.. నెహ్రూ చాలామంది మహిళలతో గడిపేవారని ట్వీట్‌ చేశాడు. 

5. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుగా చిత్రీకరించాడు. తన హయాంలో బీజేపీ పాలిత రాష్ర్టాలపై వివక్ష చూపలేదన్న మన్మోహన్‌ వ్యాఖ్యలను వక్రీకరించాడు. 

6. సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించిన రాహుల్‌గాంధీ.. నాన్‌ హిందూగా సందర్శన రికార్డులో రాశారని మాలవీయ పేర్కొన్నాడు. కానీ, అది అబద్ధం అని తేలింది. రాహుల్‌ అసలు రాతకు, మాలవీయ ట్వీట్‌ చేసిన రాతకు తేడా ఉన్నట్టు తేలింది.

7. ఆలుగడ్డతో బంగారంచేసే యంత్రాన్ని తయారుచేస్తానని రాహుల్‌గాంధీ అన్నట్టుగా మార్ఫింగ్‌ చేసిన వీడియోను కూడా అమిత్‌ పోస్ట్‌ చేశాడు.

8. పంజాబ్‌లో డేరా సచ్చాసౌదా గుర్మిత్‌ రామ్‌ రహీమ్‌కు చెందిన ఆశ్రమాన్ని కూడా రాహుల్‌ సందర్శించినట్టు ఎడిట్‌చేసిన ఫొటోను ట్విట్టర్‌లో పెట్టాడు. అది అబద్ధం.

10. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ రోడ్‌షోలో ఆప్‌ కార్యకర్తలు ఒక వ్యక్తిపై దాడి చేసినట్టు పోస్ట్‌ చేశాడు. కానీ, అంతకుముందు ఆ వ్యక్తి కేజ్రీవాల్‌ను కొట్టారు. ఆ క్లిప్‌ను కాకుండా, వ్యక్తిని కొట్టిన క్లిప్‌ను మాత్రమే పోస్ట్‌ చేశాడు.

11. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపుడు కూడా తప్పుడు ట్వీట్‌ చేశాడు. ఓట్ల శాతాన్ని తప్పుగా నిర్ధారించాడు.

12. కుంభమేళాకు వెళ్లిన తొలి దేశాధినేత మోదీ అని అమిత్‌ పోస్ట్‌చేశాడు. కానీ దేశాధినేత.. రాష్ట్రపతి కదా. అంతకుముందే, 1953లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ కుంభమేళాలో పాల్గొన్నారు.

13. నోట్ల రద్దును నోబెల్‌ గ్రహీత రిచర్డ్‌ థాలర్‌ శ్లాఘించినట్టు ట్వీట్‌ను ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేశాడు. కానీ, ఆయన అన్నది వేరు.

14. ఓ టీవీ డిబేట్‌లో రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించాడు.

15. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలో బిర్యానీ కోసమే కొందరు పాల్గొన్నారని రెండు ఫొటోలను పోస్ట్‌ చేశాడు. కానీ, ఆందోళనకారులు ఆకలితో ఉండటాన్ని గమనించి కొందరు ఆహారాన్ని అందజేశారు.

16. షాహీన్‌బాగ్‌ ఆందోళన కాంగ్రెస్‌ ఆడిన ఆట అని ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. కానీ, ఆ వీడియోతో కాంగ్రెస్‌కు ఏ సంబంధం లేదు.


logo