శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 11:31:54

పశ్చిమ బెంగాల్‌ సీఎంకు అమిత్‌ షా లేఖ

పశ్చిమ బెంగాల్‌ సీఎంకు అమిత్‌ షా లేఖ

ఢిల్లీ : కేంద్రం, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వలస కూలీలకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఈ మేరకు ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తాజాగా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు అడ్డంకులు కల్పించడంపై అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌ వ్యాప్తంగా ఉన్న వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్రం రైలు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఈ రైళ్లను పశ్చిమ బెంగాల్‌లోకి అడుగుపెట్టనీయడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి మద్దతు లభించడం లేదని పేర్కొంటూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. 

ఈ చర్య వలస కూలీల పట్ల పశ్చిమ బెంగాల్‌ చేస్తున్న అన్యాయమేనన్నారు. ఇది వారిని ఇంకా ఎక్కువ కష్టాలకు గురిచేస్తుందన్నారు. కరోనా సంక్షోభం ప్రారంభం నుంచి కేంద్రం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంది. వాస్తవాలను దాచి మరణాలను తక్కువగా చేసి చూపిస్తుందంది. కాగా ఈ క్లిష్ట సమయంలో రాష్ర్టానికి సహాయంగా ఉండాల్సిన కేంద్రం పోలిటికల్‌ వైరస్‌ను వ్యాప్తి చేస్తుందని టీఎంసీ ఎంపీ డెరిక్‌ వో బ్రెయిన్‌ అన్నారు. పరిస్థితిని ట్యాకిల్‌ చేయడంలో మమతా సర్కార్‌ పేలవమైన ప్రదర్శన చూపిందన్న ప్రచారాన్ని కేంద్రం చేయాలనుకుంటుందని ఆయన పేర్కొన్నారు.


logo