శనివారం 28 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 01:34:45

అవి నాల్కలా తాటి మట్టలా?

అవి నాల్కలా తాటి మట్టలా?

  • తమిళనాడుకిస్తున్న నిధులు ఆ రాష్ట్రం హక్కు
  • రాష్ర్టానికి ఉన్న హక్కుల ప్రకారమే ఇస్తున్నాం
  • ఇందులో కేంద్ర సర్కారు ఔదార్యమేమీ లేదు
  • చెన్నైలో హోంమంత్రి అమిత్‌షా ఉద్ఘాటన
  • రూ.67 వేల కోట్ల పథకాలకు శంకుస్థాపన 
  • తమిళనాడుకైతే హక్కు.. తెలంగాణకైతే దానమా? 
  • తెలంగాణ బీజేపీ నేతలారా.. ఇపుడేమంటారు?

చెన్నై, నవంబర్‌ 21: తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత కక్ష? ఎందుకీ విద్వేషం? ఎందుకింత సవతితల్లి ప్రేమ? పక్షపాత వైఖరి? రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని కూడా కాదనే బుకాయింపు దేనికి?.. కేవలం రాజకీయాల కోసమేనా? రాజకీయ ప్రయోజనాలే తప్ప కేంద్రం, రాష్ట్రం అనే సమాఖ్య విధానం, రాజ్యాంగస్ఫూర్తి పట్టదా? ఇప్పుడీ ద్వంద్వనీతి మరోమారు బట్టబయలైంది. తమిళనాడులో రూ.67 వేల కోట్ల విలువైన మౌలిక ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షా.. ఆ రాష్ర్టానికి ఉన్న హక్కు ప్రకారమే కేంద్రం నుంచి నిధులు, పథకాలు లభిస్తున్నాయని, ఇందులో తమ ఉదారత ఏమీ లేదని చెప్పుకొచ్చారు. 

మరి, తెలంగాణలో మాత్రం స్థానికనేతలు అదీఇదీ అని కాదు.. అన్ని పథకాలూ కేంద్రం ఉదారంగా ఇస్తున్న నిధులతోనే నడస్తున్నాయని చాటింపు వేస్తున్నారు. తమిళనాడుకైతే హక్కులు, తెలంగాణకైతే ఉదారత్వం.. ఏమిటీ రెండు నాల్కల ధోరణి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో అమిత్‌షా శుక్రవారం రెండురోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నోట రాష్ర్టాల హక్కుల గురించి మాటలు వెలువడ్డాయి. తమిళనాడుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న ఆర్థికసాయం, అందజేస్తున్న పథకాలు.. కేంద్రం సాయంగా, ఉదారంగా ఇస్తున్నవి కావని.. అవి ఒక రాష్ట్రంగా తమిళనాడుకు ఉన్న హక్కుల ప్రకారం లభిస్తున్నాయని అమిత్‌షా స్పష్టం చేశారు. ‘పూర్తి వినమ్రతతో నేనీ విషయం చెబుతున్నా. కేంద్రప్రభుత్వం ద్వారా తమిళనాడుకు లభిస్తున్న నిధులు, పథకాలు ఏదో.. సాయం చేయటంలో భాగంగా ఇస్తున్నవి కావు. అవి తమిళనాడుకు హక్కుగా లభిస్తున్నవి. 

ఇంతకుముందు ఇవి తమిళనాడుకు లభించేవి కావు. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చాక తమిళనాడుకు ఈ పథకాలు, నిధులు తప్పకుండా లభించేలా చూస్తున్నారు’ అని అమిత్‌షా తెలిపారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఆయన నోటి నుంచి ఇంత స్పష్టంగా రాష్ర్టాల హక్కుల గురించి మాటలు వస్తుంటే.. మరోవైపు, తెలంగాణలోని స్థానిక బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రంలో పలు పథకాలకు కేంద్రం ఉదారంగా సాయం చేస్తున్నదని, మోదీ ‘దయార్ద్ర హృదయం’ కారణంగానే రాష్ర్టానికి నిధులు వస్తున్నాయని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. తీసుకోవటమేగానీ ఇవ్వటం తెలియని మోదీ సర్కార్‌కు అంత సీన్‌ లేదని, కేంద్రం నుంచి చట్టప్రకారం రావాల్సిన నిధులు కూడా రావటం లేదని, వచ్చిన అరకొర నిధులు కూడా తెలంగాణకు ఉన్న హక్కు ప్రకారం లభించినవేనని రాష్ట్రప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ నేతలు పలుమార్లు స్పష్టం చేశారు. అయినా కూడా.. బీజేపీ నేతలు సొంత డబ్బాను మానటం లేదు సరికదా.. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దీనిని మరింత పెంచారు.

‘యూపీఏ హయాంలో అంతా నిర్లక్ష్యమే’!

రాజధాని చెన్నైతోపాటు తమిళనాడువ్యాప్తంగా రూ.67,000 కోట్ల భారీవ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో  చెన్నై మెట్రోరైలు ఫేజ్‌-2, చెన్నై ప్రజలకు తాగునీటి కోసం నిర్మించనున్న ఐదో రిజర్వాయర్‌ వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగానే అమిత్‌షా తమిళనాడు హక్కులపై ‘మోదీకి ఉన్న శ్రద్ధ’ గురించి చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష డీఎంకే భాగస్వామ్య పార్టీగా ఉన్న యూపీఏ పదేండ్ల హయాంలో తమిళనాడుకు అన్యాయం జరిగిందని, మోదీ వచ్చిన తర్వాతనే ఆ రాష్ర్టానికి హక్కుగా దక్కాల్సినవి దక్కుతున్నాయని చెప్పారు. మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న తమిళనాడులో తంబీల మన్నన పొందటానికి అమిత్‌షా ఇలాంటి చాలా కబుర్లు చెప్పారు. కానీ, దీనిపై విశ్లేషకులు మాత్రం పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. 

ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షమైన అన్నాడీఎంకే అధికారంలో ఉంది కాబట్టి.. రాష్ట్రం, హక్కులు, కేంద్ర-రాష్ట్ర సుహృద్భావ సంబంధాల గురించి అమిత్‌షా మంచిమాటలు మాట్లాడారని, ఎన్‌డీఏతో అంటకాగని పార్టీలు అధికారంలో ఉంటే మాత్రం.. ఇవేవీ గుర్తుకు రావా? అని నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా, హక్కుగా దక్కాల్సిన నిధులను కూడా ఆయా రాష్ర్టాలకు తాము ఉదారంగా ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ వ్యవహారం చూస్తుంటే.. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం.. బద్ధాంతం.. వంటివేమీ లేదని, ఏ రోటికాడ ఆ రోటి పాట పాడటమేనని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. పచ్చి అవకాశవాదమే తప్ప కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒక విధానం అంటూ ఏమీ లేదని మండిపడుతున్నారు.

అమిత్‌షాపై ప్లకార్డు విసిరివేత

చెన్నైలో పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న అమిత్‌షాపై ఒక వ్యక్తి ప్లకార్డు విసిరివేయడానికి ప్రయత్నించాడు. అది షాకు దూరంగా పడింది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘పూర్తి వినమ్రతతో నేనీ విషయం చెప్తున్నా. కేంద్రప్రభుత్వం ద్వారా తమిళనాడుకు లభిస్తున్న నిధులు, పథకాలు ఏదో.. సాయం చేయటంలో భాగంగా ఇస్తున్నవి కావు. అవి తమిళనాడుకు హక్కుగా లభిస్తున్నవి. 

-అమిత్‌ షా