శనివారం 16 జనవరి 2021
National - Dec 22, 2020 , 18:39:50

అమిత్ షా.. నాకు ఢోక్లా ఎప్పుడు తినిపిస్తున్నారు: మ‌మ‌తా

అమిత్ షా.. నాకు ఢోక్లా ఎప్పుడు తినిపిస్తున్నారు: మ‌మ‌తా

కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చుర‌కలంటించారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. ఆయ‌న చేసిన ప్ర‌తి ఆరోప‌ణ‌నూ తిప్పి కొట్టిన ఆమె.. త‌న‌ను త‌ప్పుగా నిరూపించండి లేదా ఢోక్లా తినిపించండి అని అన్నారు. షా కావాల‌నే బెంగాల్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. గ‌త వారం బెంగాల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా దీదీ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు అమిత్ షా. అయితే ఆయ‌న చేసిన ప్ర‌తి ఆరోప‌ణ‌కూ మంగ‌ళ‌వారం కౌంట‌ర్ ఇచ్చారు మ‌మ‌తా బెన‌ర్జీ. తృణ‌మూల్ కాంగ్రెస్ పాల‌న‌లో గ‌త ప‌దేళ్ల‌లో రాజ‌కీయ హ‌త్య‌లు, నేరాలు త‌గ్గిన‌ట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్ల‌డించిన‌ డేటాను ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌స్తావించారు. అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి. నాకు ఢోక్లా అన్నా.. ఇత‌ర గుజ‌రాతీ వంట‌కాల‌న్నా చాలా ఇష్టం అని దీదీ అన్నారు. ఒక దేశానికి హోంమంత్రి ఏదైనా మాట్లాడుతున్న‌ప్పుడు అందుకు త‌గిన డేటా, వాస్త‌వాలు, అంకెలు చూపించాలి. అన్ని అభివృద్ధి సూచిక‌ల్లో  దేశంలోని వివిధ రాష్ట్రాల కంటే బెంగాల్ ముందుంది. అయినా అమిత్ షా కావాల‌నే బెంగాల్‌ను అప్ర‌తిష్టపాలు చేస్తున్నారు అని మ‌మ‌తా విమ‌ర్శించారు.