ఆదివారం 31 మే 2020
National - May 18, 2020 , 16:13:35

అరుణాచల్: లాక్‌డౌన్ మధ్యలో నిరసన ప్రదర్శన

అరుణాచల్: లాక్‌డౌన్ మధ్యలో నిరసన ప్రదర్శన

ఐటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల లోమ్‌డింగ్ పట్టణంలో సోమవారం లాక్‌డౌన్ పరిస్థితుల నడుమ నిరసన ప్రదర్శన జరిగింది. రెండు రోజుల క్రితం వాంచో తెగకు చెందిన ఓ వ్యక్తిని భారత సైన్యం గస్తీ దళం కాల్చిచంపింది. ఈ ఘటనకు నిరసనగా వాంచో మండలి ఈ ప్రదర్శనను నిర్వహించింది. ఈ శాంతియుత నిరసన ప్రదర్శన లోమ్‌డింగ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద ముగిసింది. మృతునికి న్యాయం చేయాలని, అతని కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాంచో మండలి సభ్యులు ఆ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగలేదని, లాక్‌డౌన్ నిబంధనల మేరకే ప్రదర్శన జరిగిందని డిప్యూటీ కమిషర్ చేస్టా యాదవ్ చెప్పారు. విజ్ఞాపన పత్రాన్ని తగిన చర్య నిమిత్తం సంబంధిత అధికారికి పంపించామని తెలిపారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు మినహా ఎక్కడా జనం గుమిగూడరాదని కేంద్ర హోంశాఖ నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో ప్రత్యేక మినహాయింపుగా ఈ ప్రదర్శనను జిల్లా యంత్రాంగం అనుమతించింది. పుమావ్ గ్రామంలో శనివారం జరిగిన కాల్పుల ఘటనపై శాంతియుత నిరసన ర్యాలీ జరిపేందుకు ప్రజల నుంచి డిమాండ్ రావడంతో అనుమతి మంజూరు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం అంతకుముందు తెలిపింది. ప్రత్యేక మినహాయింపు కింద అనుమతి ఇచ్చామని, ఇక ముందు ఎలాంటి ర్యాలీలను అనుమతించబోమని స్పష్టం చేసింది. భారత సైన్యానికి చెందిన 19వ సిఖ్ రెజిమెంట్ నాగా మిలిటెంట్ల కోసం గాలింపు జరుపుతుండగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆ కాల్పుల్లో నాగా అనుబంధ తెగ అయిన వాంచోకు చెందిన లమ్‌దాన్ లుఖామ్ (60) అనే వ్యక్తి మరణించాడు. ఇతర గ్రామస్థులకు, సైనిక సిబ్బందికి కూడా గాయాలయ్యాయని తెలిసింది. నాగా సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ - ఇసాక్ - ముయివా (ఎన్ఎస్‌సీఎన్-ఐఎం)కు చెందిన మిలిటెంట్లు గ్రామంలో ఉన్నట్టు సమాచారం అందడంతో గాలింపు చేపట్టామని శనివారం రాత్రి బారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రామస్థులను దూరం పోవాల్సిందిగా హెచ్చరిస్తూ ఎనిమిది సార్లు ఎదురుకాల్పులు జరిపినట్టు పేర్కొన్నది. గ్రమాస్థులు నిరసనకు దిగి రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ఈలోగా మిలిటెంట్లు తప్పించుకున్నారని వివరించింది. ఆ గందరగోళంలో ఒకగ్రామస్థుడు చనిపోయాడని, పలువురికి గాయాలయాయ్యని సైన్యం తెలిపింది. అయితే స్థానికులు మాత్రం  ముందురోజు జరిగిన గొడవకు ప్రతీకారంగానే సైన్యం దాడికి దిగిందని అంటున్నారు. సైన్యం చర్యను కండిస్తూ ఈశాన్య ప్రాంత విద్యార్థి సంఘం (నేసో) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. లోమ్‌డింగ్ ప్రత్యేక సైనికాధికారాల చట్టం పరిధిలో ఉంది కనుక ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని అరుణాచల్ డీజీపీ ఆర్పీ ఉపాధ్యాయ చెప్పారు.


logo