శుక్రవారం 03 జూలై 2020
National - Jan 24, 2020 , 01:01:04

నిర్భయ దోషుల మౌనం

నిర్భయ  దోషుల  మౌనం
  • చివరి ములాఖత్‌పై పెదవి విప్పని నలుగురు దోషులు

న్యూఢిల్లీ, జనవరి 23: తీహార్ జైలులో ఉన్న నలుగురు నిర్భయ దోషులు అధికారులకు సహకరించడం లేదు. నిబంధనల ప్రకారం ఉరిశిక్ష అమలుకు ముందు దోషులు తమ చివరి కోరికను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారు కుటుంబ సభ్యులను లేదా నచ్చిన వ్యక్తులను కలుసుకొనే అవకాశం ఉంటుంది. అయితే నిర్భయ దోషులు తాము చివరగా ఎవరిని కలుస్తారన్నది చెప్పడం లేదని అధికారులు గురువారం తెలిపారు. నలుగురు దోషులు వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా ప్రస్తుతం మూడో నంబర్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. డెత్ వారంట్లు జారీ అయిన తర్వాత మేము వారి వద్దకు వెళ్లి.. చివరగా ఎవరిని కలుసుకోవాలని ఉన్నదో చెప్పాలని సూచించాం. అయితే.. వారు ఇప్పటివరకు స్పందించలేదు అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆ నలుగురిని కలుసుకొనేందుకు వారి కుటుంబ సభ్యులకు వారానికి రెండుసార్లు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. చివరి ములాఖత్ ఎన్నడనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. వారిని ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 

నిర్భయ జడ్జీ బదిలీ

నిర్భయ దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీయాలంటూ ఇటీవల డెత్‌వారంట్లు జారీ చేసిన ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి సతీశ్ కుమార్ అరోరా బదిలీ అయ్యారు. ఆయనను ఏడాదిపాటు డిప్యూటేషన్ మీద సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్‌గా నియమించారు. జస్టిస్ అరోరా ప్రస్తుతం నిర్భయ కేసుతోపాటు పలు కీలక కేసులపై విచారణ జరుపుతున్నారు. వాటిని త్వరలో నూతన జడ్జీకి కేటాయిస్తారని అధికారులు తెలిపారు.


logo