శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 15:50:20

క‌రోనా వేళ ఇస్రో ఘ‌న‌త‌.. క‌క్ష్య‌లోకి ప‌ది ఉప‌గ్ర‌హాలు

క‌రోనా వేళ ఇస్రో ఘ‌న‌త‌..  క‌క్ష్య‌లోకి ప‌ది ఉప‌గ్ర‌హాలు

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హమ్మారి నేపథ్యంలో.. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించ‌డం అసాధ్యం. కానీ ఆ అద్భుతాన్ని ఇస్రో త‌న ఖాతాలో వేసుకున్న‌ది.  అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కుద‌ర‌దు, కానీ అద్వితీయంగా, అసాధార‌ణ రీతిలో ఇస్రో .. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్‌ను దిగ్విజ‌యంగా ప్ర‌యోగించింది.  ఇవాళ ఇస్రో శాస్త్రవేత్త‌లు విజ‌య‌వంతంగా ప‌ది ఉప‌గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించారు. 575 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌క్ష్య‌లోకి శాటిలైట్ల‌ను ప్ర‌వేశపెట్టారు. ఇస్రోకు చెందిన EOS-01తో పాటు విదేశాల‌కు చెందిన 9 ఉపగ్ర‌హాల‌ను ప్ర‌యోగించారు. 


ఏపీలోని శ్రీహ‌రికోట నుంచి ఇవాళ మ‌ధ్యాహ్నం 3.10 నిమిషాల‌కు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ నింగికి ఎగిరింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్‌-1 శాటిలైట్‌తో పాటు మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లు నింగిలోకి దూసుకువెళ్లాయి. పీఎస్ 1 ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింది. పీఎస్‌2 కూడా నార్మ‌ల్‌గా కొన‌సాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్న‌ట్లే స‌ప‌రేట్‌ అయ్యింది. పీఎస్ఎల్వీ బ‌రువు 290 ట‌న్నులు. అన్ని ద‌శ‌లు అనుకున్న రీతిలో పూర్తి అయ్యాయి. తొమ్మిది ఉప‌గ్ర‌హాల్లో అమెరికా, ల‌గ్జంబ‌ర్గ్‌, లుథివేనియా దేశాల‌కు చెందిన ఉన్నాయి. అమెరికాకు చెందిన లీమ‌ర్ ఉప‌గ్ర‌హాలను.. మ‌ల్టీ మిష‌న్ రిమోట్ సెన్సింగ్ కోసం వినియోగించ‌నున్నారు. ల‌గ్జంబ‌ర్గ్‌కు చెందిన శాటిలైట్ల‌ను మారిటైమ్ అప్లికేష‌న్ల కోసం వాడ‌నున్నారు.  టెక్నాల‌జీ డెమానిస్ట్రేష‌న్ కోసం లుథివేనియా ఉప‌గ్ర‌హాలు వినియోగించ‌నున్న‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. 

ఇవాళ ఉద‌యం పీఎస్‌2 రెండ‌వ ద‌శ‌లో ఆక్సిడైజ‌ర్ ఫిల్లింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్ EOS-01తో..  వ్య‌వ‌సాయం, అట‌వీ, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అప్లికేష‌న్లు ప‌రిశీలించ‌నున్నారు.  న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం క‌స్ట‌మ‌ర్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించారు.అయితే క‌రోనా నేప‌థ్యంలో శ్రీహ‌రికోట‌లో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేశారు.  మీడియాకు ఆహ్వానం లేదు. లాంచ్ వ్యూవింగ్ గ్యాల‌రీని మూసివేశారు.