బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 08:24:58

చనిపోయాడనుకున్న కుమారుడిని చూసి తల్లిదండ్రుల ఆనంద భాష్పాలు

చనిపోయాడనుకున్న కుమారుడిని చూసి తల్లిదండ్రుల ఆనంద భాష్పాలు

కరోనా లాక్‌డౌన్‌ ఓ యువకుడిని తన తల్లిదండ్రుల చెంతకు చేరేలా చేసింది. తొమ్మిదేళ్ల క్రితం అతను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. ఆ యువకుడు పెద్దగా చదువుకోలేదు. కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదివాడు. బతుకుదెరువు కోసమని గుజరాత్‌ వెళ్లిపోయాడు ఆ యువకుడు. కుమారుడి కోసం తల్లిదండ్రులు వెతికారు. కానీ లాభం లేదు. కుమారుడు తిరిగి రాకపోవడంతో చివరకు అతను చనిపోయాడని తల్లిదండ్రులు భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతూరుకి వెళ్లాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతను తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.. వారిలో సంతోషాన్ని నింపాడు. తాను క్షేమంగానే ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పడంతో వారు ఆనంద భాష్పాలు రాల్చారు. 

ఒడిశాలోని దలాబేడ గ్రామానికి చెందిన అమృత మాజ్హీ, ధనబాలి మాజ్హీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. చిన్న కుమారుడు భూబేన్‌ మాజ్హీ(27).. 2011లో ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. అయితే ఉపాధి కోసమని భూబేన్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. ఈ సమయంలో కుమారుడు తిరిగిరాకపోవడంతో.. భూబేన్‌ చనిపోయాడని తల్లిదండ్రులు భావించారు. 2011 నుంచి మొన్నటి వరకు భూబేన్‌తో తల్లిదండ్రులకు, బంధువులకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో భూబేన్‌ పని చేస్తున్న పరిశ్రమను మూసివేశారు. దీంతో అతను బతకడం కష్టమైంది. ఎలాగైనా సొంతూరికి వెళ్లాలని భూబేన్‌ నిర్ణయించుకున్నాడు. కానీ అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మొత్తానికి ఒడిశాలోని నబరంగ్‌పూర్‌ ఎంపీ రమేశ్‌ మాజ్హీ మొబైన్‌ నంబర్‌ సంపాదించి.. అతనికి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. 

ఎంపీ రమేశ్‌ స్థానిక నాయకులు, జర్నలిస్టు సహకారంతో తన తల్లిదండ్రుల నుంచి భూబేన్‌కు వీడియో కాల్‌ చేయించారు. తమ కుమారుడిని సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత చూసిన తల్లిదండ్రులు ఆనంద భాష్పాలు రాల్చారు. భూబేన్‌ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. తాను క్షేమంగానే ఉన్నానని.. త్వరలోనే ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు కుమారుడు భరోసా ఇచ్చాడు. కరోనా వైరస్‌ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఇంటికి వస్తానని భూబేన్‌ తల్లిదండ్రులకు చెప్పాడు. logo