శుక్రవారం 10 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:25

35 మంది చైనా సైనికులు మృతి!

35 మంది చైనా సైనికులు మృతి!

  • మృతుల్లో కమాండింగ్‌ ఆఫీసర్‌ కూడా
  • అమెరికా ఇంటెలిజెన్స్‌ రిపోర్టు వెల్లడి
  • మరో నలుగురు భారత జవాన్ల పరిస్థితి విషమం 

న్యూఢిల్లీ: గల్వాన్‌ ఘర్షణలో కనీసం 35 మంది చైనా సైనికులు మరణించటం లేదా తీవ్రంగా గాయపడ్డారని అమెరికా ఇంటెలిజెన్స్‌ రిపోర్టు వెల్లడించింది. మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్‌ కూడా ఉన్నారని తెలిపింది. తమ సైనికులు ఎంతమంది మరణించారన్న విషయాన్ని చైనా ఇప్పటివరకు బయటపెట్టలేదు. కానీ, చైనా సైనిక అధికారుల సంభాషణల ఆధారంగా దాదాపు 35 మంది మరణించినట్టు తెలుస్తున్నదని అమెరికా రిపోర్టును ఉటంకిస్తూ భారత ప్రభుత్వం తెలిపింది. ఈ ఘర్షణలో 18 మంది భారత సైనికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సైనిక వర్గాలు బుధవారం తెలిపాయి. 

పరిస్థితిని సమీక్షించిన రక్షణ మంత్రి

గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మరోసారి సమీక్షించారు. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులతో ఆయన బుధవారం కూడా సమావేశమ్యారు. లడఖ్‌తోపాటు చైనాతో ఉన్న సరిహద్దు పొడవునా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఘర్షణ జరిగిన ప్రదేశం నుంచి సైనికుల మృతదేహాలను భారత హెలికాప్టర్లు మంగళవారం 16 ట్రిప్పుల్లో తరలించాయి. బుధవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలను గల్వాన్‌ నుంచి లేహ్‌కు తరలించారు.

గల్వాన్‌లో మేజర్‌ జనరళ్ల చర్చలు

గల్వాన్‌ లోయలో చైనా, భారత్‌ సైన్యాల మధ్య బుధవారం మేజర్‌ జనరళ్ల స్థాయి చర్చలు జరిగాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణ అనంతరం పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ చర్చలు చేపట్టారు. ఇరువైపుల సైనికులను ఉపసంహరించాలన్న అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. మరోసారి చర్చలు జరుపనున్నారు.


logo