బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:29:29

ఇన్సూరెన్స్ సేవలు అందించనున్న అమెజాన్

ఇన్సూరెన్స్ సేవలు అందించనున్న అమెజాన్

ఢిల్లీ : ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ తన సేవలను విస్తరించేందుకు  సిద్ధమైంది. భారతదేశంలో సరికొత్త సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఇన్సూరెన్స్ పంపిణీ రంగంలోకి ప్రవేశిస్తున్నది. ఈ మేరకు సాధారణ బీమా రంగంలో సేవలు అందించే "అక్కో" అనే స్టార్టప్ కంపెనీ తో చేతులు కలిపింది. "అమెజాన్ పే" యాప్ ద్వారా ఇన్సూరెన్స్ సేవలను కూడా అందించనున్నది. ఇందుకోసం కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అవతారం ఎత్తిన అమెజాన్.. త్వరలోనే పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభించబోతున్నది. అత్యంత వేగంగా, వీలైనంత తక్కువ ధరలో పాలసీ లను అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తన కొత్త అవతారంలో భాగంగా... అమెజాన్ ఇకపై అమెజాన్ పే ప్లాట్ఫారం పై మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లను విక్రయించనుంది. ఇండియా లో సాధారణ బీమా రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టాలను పటిష్టం చేస్తూ కఠినతరమైన నిబంధనలు పెడుతోంది. వినియోగదారుల్లోనూ గతంతో పోల్చితే అవగాహన పెరిగింది. దీంతో మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ కు గిరాకీ పెరుగుతోంది. ఈ పాలసీ లను అన్ని కంపెనీలు ఆన్లైన్ లో కూడా విక్రయిస్తున్నా ... ఇటీవల కాలంలో అక్కో వంటి స్టార్టప్ కంపెనీల రాకతో ఈ రంగంలో ఆన్లైన్ పాలసీ విక్రయాలు పెరిగాయని చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు కాంటాక్ట్ లెస్ సేవలకు పెద్ద పీట వేస్తున్నారు.

ఇది కూడా ఈ రంగంలో ఆన్లైన్ పాలసీ విక్రయాలు పెరిగేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు, వారికి మెరుగైన సేవలు అందించేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కేవలం రెండు నిమిషాల్లోనే మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ని జారీ చేయనుంది. అలాగే అనేక వేల్యూ యాడెడ్ సర్వీసులను కూడా అందించనుంది. అలాగే మూడు రోజుల్లో తప్పనిసరి క్లెయిమ్ సేవలు, ఒక ఏడాది రిపేర్ సర్వీస్ వారంటీ వంటి అనేక సేవలను కూడా ఆఫర్ చేయనున్నది.  


logo