బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 19:10:01

ప్రతి ఉత్పత్తిపై తయారైన దేశం పేరు ఉండాల్సిందే: అమెజాన్‌ ఇండియా

ప్రతి ఉత్పత్తిపై తయారైన దేశం పేరు ఉండాల్సిందే: అమెజాన్‌ ఇండియా

న్యూ ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొచ్చిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా ఎట్టకేలకు మద్దతు ప్రకటించింది. తమ సైట్‌ ద్వారా అమ్మే ప్రతి ఉత్పత్తిపై అది తయారైన దేశం పేరు కచ్చితంగా పేర్కొనాల్సిందే అని అమ్మకందారులను ఆ సంస్థ ఆదేశించింది. ఆగస్టు 10లోగా ఉత్పత్తుల జాబితాల సమాచారం అందించాలని వారికి ఈ మెయిల్‌ ద్వారా సందేశం పంపింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయం సమృద్ధ భారత్‌ కోసం పాటుపడుతున్న నేపథ్యంలో దేశంలో అమ్మే అన్ని ఉత్పత్తులపై అవి ఎక్కడ తయారుచేశారో కచ్చితంగా పేర్కొనాలంటూ ఈ కామర్స్‌ సంస్థలకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలాగే, వర్తక సంఘాలు కూడా చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. గత నెలలో 59 చైనా యాప్‌లను భారత సర్కారు నిషేధించింది. భారత్‌, చైనా మధ్య హింసాత్మక సరిహద్దు ఘర్షణ తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ గవర్నమెంట్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కామర్స్‌ సంస్థలు తమ అమ్మకందారులకు ఉత్పత్తులపై దేశం పేరు పేర్కొనాలని స్పష్టంగా సూచిస్తున్నాయి. 

‘ఆగస్టు 10, 2020 నాటికి ప్రతి ఉత్పత్తిపై అది తయారుచేయబడిన దేశం పేరు పేర్కొనకుంటే చర్యలు తీసుకుంటాం. లిస్ట్‌ నుంచి మీ ఉత్పత్తులను తొలగిస్తాం.’ అని అమ్మకందారులకు అమెజాన్‌ సందేశం పంపింది. అలాగే, తామిచ్చిన సమచారం కచ్చితమైనది, అప్‌డేటెడ్‌ అని ధ్రువీకరించుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత అమ్మకందారులదేనని స్పష్టం చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo