శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 01:51:03

అమర్‌సింగ్‌ ఇకలేరు

అమర్‌సింగ్‌ ఇకలేరు

  • l సింగపూర్‌లో అనారోగ్యంతో మృతి 
  • l అజాతశత్రువుగా పేరున్న నేత 

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాజకీయల్లో సెలబ్రిటీగా (ప్రముఖవ్యక్తిగా), సెలబ్రిటీల్లో రాజకీయనేతగా రాణించిన అమర్‌సింగ్‌ శనివారం సింగపూర్‌లో మరణించారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత మార్చినుంచి సింగపూర్‌లో ఒక దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బాలగంగాధర్‌ తిలక్‌ 100వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం ట్వీట్‌ చేసిన ఆయన ఆరోగ్యం మధ్యాహ్నం క్షీణించటంతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. 64 ఏండ్ల వయసున్న అమర్‌సింగ్‌ రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ నేత. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ములాయంకు కుడిభుజం 

1990, 2000 దశకాల్లో అమర్‌సింగ్‌ దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌కు కుడిభుజంలా మెలిగారు. మొదటిసారి 1996లో యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొనసాగిన పదేండ్లలో అమర్‌సింగ్‌ ఢిల్లీలో చక్రం తిప్పారు. అంతేస్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకున్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవటంతో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ముగ్గురు ఎంపీలకు అమర్‌సింగ్‌ డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ‘ఓటుకు నోటు’ కుంభకోణం కేసులో 2011లో జైలుకు కూడా వెళ్లారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ములాయం కుటుంబంలో చీలికలకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో అమర్‌సింగ్‌ను 2010లో ఎస్పీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ ఆయనకు ములాయంతో మంచి సంబంధాలే ఉండేవి. రాష్ట్రీయ లోక్‌మంచ్‌ పార్టీని స్థాపించి 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కసీటు కూడా గెలువలేదు. 2016లో ములాయం సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమర్‌సింగ్‌కు అన్నిపార్టీల నేతలతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. దానివల్లే తన వ్యాపారాలను యూపీతోపాటు పలురాష్ర్టాలకు విస్తరించారని అంటారు. సినీ పరిశ్రమతోనూ అమర్‌సింగ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. తెలుగు నటి జయప్రద ఎస్పీలో కీలక నేతగా ఎదగటానికి ఆయన తోడ్పడ్డారు. ఒకట్రెండు సినిమాల్లో కూడా ఆయన నటించారు. అమర్‌సింగ్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరితో ఆయన స్నేహంగా ఉండేవారని మోదీ ట్వీట్‌ చేశారు.


logo