గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 03:43:56

ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై దాడే!

ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై దాడే!
  • ఆ పోస్టర్లు తొలిగించండి.. లక్నో పోస్టర్లపై యూపీ సర్కార్‌కు అలహాబాద్‌ హైకోర్టు ఆదేశం

లహాబాద్‌/ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌కు అలహాబాద్‌ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో విధ్వంసానికి కారకులని ఆరోపిస్తూ కొందరు వ్యక్తుల ఫొటోలు, చిరునామాలతో ఏర్పాటుచేసిన పోస్టర్లను తొలిగించివేయాలని సోమవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని చీఫ్‌ జస్టిస్‌ గోవింద్‌ మాథూర్‌, జస్టిస్‌ రమేశ్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఈ నెల 16 లోపు నివేదిక సమర్పించాలని లక్నో జిల్లా కలెక్టర్‌, లక్నో నగర పోలీస్‌ కమిషనర్‌లను ఆదేశించింది. ప్రభుత్వ చర్య ప్రజల వ్యక్తిగత గోప్యతపై అవాంఛనీయంగా జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. 


దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను ఈ నెల 7న సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం ఆదివారం అసాధారణ రీతిలో విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. హైకోర్టు తీర్పుపై ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంపై గౌరవం గానీ, పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కుపై పరిజ్ఞానం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మేం హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’ అని అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. యూపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ ప్రతిస్పందిస్తూ..యూపీ సర్కార్‌ రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాతంత్ర వ్యతిరేక వైఖరిని హైకోర్టు తీర్పు బయటపెట్టిందన్నారు. కాగా, దాడులకు పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియను కొనసాగిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మీడియా సలహా దారు మృత్యుంజయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. 

logo