శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:50

జిత్తులమారి కరోనా..రోజుకో కొత్త లక్షణం

జిత్తులమారి కరోనా..రోజుకో కొత్త లక్షణం

  • తాజాగా దద్దుర్లు, మంట.. పలువురిలో వాంతులు, విరేచనాలు  
  • లక్షణాల ఆధారంగా చికిత్స ఇస్తున్నామంటున్న వైద్యులు

న్యూఢిల్లీ, జూలై 25: కరోనా మహమ్మారి జిత్తులమారి వేషాలు అంతుచిక్కడం లేదు. రోజుకో కొత్త లక్షణంతో అటు జనాన్ని, ఇటు వైద్యులను బెంబేలెత్తిస్తున్నది. కరోనా లక్షణాల్లో ఇటీవల గణనీయ మార్పులు సంభవించినట్లు వైద్యులు చెబుతున్నారు. కొందరిలో దద్దుర్లు, మంట వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. అలాగే మరికొందరిలో డయేరియాతోపాటు వాసన, రుచి గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు 15-20 శాతం మందిలో కనిపిస్తున్నాయని నోయిడాకు చెందిన ైవెద్యనిపుణులు రాకేశ్‌ గుప్తా తెలిపారు. లక్షణాల్లో మార్పు ఆశ్చర్యకరమేమీ కాదని, చికిత్సలో ఇవి కీలకం కావొచ్చని అన్నారు. 

పాక్షిక లక్షణాలున్నా సీరియస్‌గా తీసుకోవాలి..

వసుంధరలోని లె క్రెస్ట్‌ దవాఖానకు చెందిన డాక్టర్‌ రాహుల్‌ కే శర్మ మాట్లాడుతూ.. ఇంతకుముందు గుర్తించని చాలా లక్షణాలు ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పారు. ‘అతిసారం (డయేరియా) ఇప్పుడు కరోనా రోగులందరిలోనూ కనిపిస్తున్నది.  డయేరియాతో బాధపడే వారు కరోనా రోగులు కాదని తొలుత భావించాం. అయితే కొందరిలో మూడు నాలుగు రోజుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చాం’ అని ఆయన వివరించారు. జ్వరం లేని వారిలో కూడా న్యూమోనియా తలెత్తినట్లు చెప్పారు. అన్ని లక్షణాలు ఒకేసారి బయటపడవని, పాక్షిక లక్షణాలు కనిపించినా సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. 

జ్వరమే ముంచిందా?

జ్వరాన్నే కరోనా లక్షణంగా భావించడం వల్ల మొదట్లో వైరస్‌ను అడ్డుకోవడంలో విఫలమైనట్టు ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు చెప్తున్నారు. తొలినాళ్లలో కేవలం 17 శాతం మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు ఉన్నట్లు వారి అధ్యయనంలో తేలింది.  44 శాతం మందిలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవు. లక్షణాలున్నవారిలో ఎక్కువమంది దగ్గు ఉన్నట్లు చెప్పారు. 

ఏ లక్షణం దేనికి సంకేతం? 

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మామూలుగానే పలు రకాల జబ్బులు వస్తుంటాయి. వాటిని కరోనాగా భావించి భయపడాల్సిన పని లేదు. రెండింటి మధ్య ఉన్న తేడాలు.. 

కరోనా లక్షణాలు: జలుబు ఉన్నా ముక్కు కారదు. తీవ్ర జ్వరం ఉంటుంది. పొడి దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలియదు. తలనొప్పి, గొంతునొప్పి, ఛాతినొప్పి, ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటాయి. కండ్లు ఎర్రబడతాయి. వాంతులు, విరేచనాలు ఉంటాయి.

సీజనల్‌ వ్యాధుల లక్షణాలు: సాధారణ జ్వరం ఉంటుంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది. ముక్కు కారుతుంది. రుచి, వాసన తెలుస్తాయి. తలనొప్పి, ఒళ్లునొప్పులు సాధారణంగా ఉంటాయి. గొంతునొప్పి ఉంటుంది. ఛాతినొప్పి ఉండదు. కండ్లు ఎర్రబడవు. వాంతులు, విరేచనాలు ఉంటాయి.

వినికిడి లోపం కూడా లక్షణమే

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ చెవిలో కర్ణభేరి ప్రాంతంలో కూడా తిష్ఠ వేస్తున్నట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు. దీని ప్రభావంతో కరోనా రోగుల్లో వినికిడి సమస్య కూడా ఎదురవుతున్నట్లు వైద్యనిపుణులు తెలిపారు. అంటే పాజిటివ్‌ రోగుల్లో సరిగ్గా వినిపించకపోవడం, చెవిపోటు తదితర లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ లక్షణాలు ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రస్తుతం మన దేశంలో వీటిని గుర్తించిన దాఖలాలు లేవని ఉస్మానియా ఈఎన్‌టీ వైద్యులు చెప్పారు.


logo