డెడ్‌లైన్ దగ్గరపడుతుంది. లక్ష్యమేమో పూర్తయ్యేలా లేదు. వచ్చేది ఎన్నికల సీజన్. మరేం చెయ్యాలి?
‘అబద్ధాలతో వాస్తవాలను కప్పిపెడితే..?’
ఇంటింటికీ నల్లా నీరు పేరిట తీసుకొచ్చిన ‘జల్ జీవన్ మిషన్’ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇదే అమలుచేస్తున్నది. కనెక్షన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు, నీటిని సరఫరా చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నది.
అయితే, క్షేత్రస్థాయి పరిశీలనలో అసలు విషయాలు బయటపడటంతో కమలం పార్టీ నీటి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Jal Jeevan Mission | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతీ ఇంటికి నల్లా నీటిని అందించే ఉద్దేశంతో 2019లో కేంద్రంలోని బీజేపీ సర్కారు హర్ ఘర్ జల్ పేరిట ‘జల్ జీవన్ మిషన్’ (జేజేఎం) పథకాన్ని తీసుకొచ్చింది. 2024 సాధారణ ఎన్నికలకు ముందే ప్రతి ఇంటికీ నల్లా నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 19.23 కోట్ల ఇండ్లు ఉండగా.. శనివారంనాటికి.. 13.08 కోట్ల ఇండ్లకు (68.07 శాతం) నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో పాటు నీటిని సరఫరా చేస్తున్నట్టు జల్ జీవన్ మిషన్ వెబ్సైట్ రికార్డుల్లో, ఆఫీసుల్లోని కాగితాలపైనే ఉన్నది. అయితే, కేంద్రం చెబుతున్నట్టు 68.07 శాతం ఇండ్లకు నిజంగానే నీటి సరఫరా జరుగుతున్నదా? అనే అనుమానంతో జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్‌లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. ఈ పరిశీలనలో ప్రభుత్వం చెబుతున్న వివరాలకు, వాస్తవపరిస్థితులకు ఎంతో తేడా ఉన్నట్టు బయటపడింది.
యూపీలోని మహోబా జిల్లాలో 2019నాటికి 1,612 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నట్టు రికార్డుల్లో నమోదైంది. అయితే, నాలుగేండ్లు తిరిగేసరికి ఈ సంఖ్య 1,29,209కి చేరింది. అంటే జిల్లాలోని 98 శాతం గ్రామాల్లోని ఇండ్లకు నల్లా నీటి సరఫరా జరుగుతున్నట్టు జేజేఎం వెబ్సైట్లో నమోదు చేశారు. దేశంలోని మరే ఇతర జిల్లాలో జరిగిన పనుల్లో ఈ స్థాయిలో పురోగతి కనిపించలేదు. దీంతో ‘హిందూ’ ప్రతినిధులు జిల్లాలోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అయితే, జేజేఎం వెబ్సైట్లో రికాైర్డెన గణాంకాలకు, వాస్తవంగా వెలుగుచూసిన విషయాలకు ఎక్కడా పొంతనలేకపోవడం గమనార్హం.
మహోబా జిల్లాలో ఉన్న 398 గ్రామాల్లో 385 పల్లెల్లోని అన్ని ఇండ్లకు నల్లా నీటి కనెక్షన్లను ఇవ్వడమే కాకుండా నీటిని సరఫరా చేస్తున్నట్టు జేజేఎంలో నమోదు చేశారు. అయితే, జిల్లాలోని 100 గ్రామాల్లోని ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లతో పాటు నీటి సరఫరా జరుగుతున్నట్టు అధికారి ఒకరు తెలిపారు. కానీ, ఆ 100 గ్రామాల్లోని వందలకొద్దీ ఇండ్లకు ఇప్పటికీ నల్లా కనెక్షన్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. జేజేఎం పథకం లక్ష్యాల ప్రకారం.. రోజుకు ఒక్కో వ్యక్తికి కనీసం 55 లీటర్ల సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. అయితే, అలా జరుగట్లేదని పరిశీలనలో తేలింది. 2019లో యూపీవ్యాప్తంగా 5.1 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 1.6 కోట్ల ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చినట్టు డాష్‌బోర్డ్ రికార్డులు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అలా లేవు.
మహోబా జిల్లాలో చర్ఖారీ, జయిత్పూర్, పన్వారీ, కబ్రాయి అనే నాలుగు బ్లాకులు ఉన్నాయి. చర్ఖారీ బ్లాక్ కింద ఉన్న 48 గ్రామాల్లో 24,037 ఇండ్లు ఉన్నాయి. ఆస్తౌన్ అనే గ్రామంతో పాటు 48 గ్రామాలన్నింటికీ నల్లా కనెక్షన్లతో పాటు నీటి సరఫరా జరుగుతున్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, ఆస్తౌన్ గ్రామంలో ఆ పరిస్థితి లేదు. గ్రామంలోని మొత్తం 420 ఇండ్లలో సగం ఇండ్లకే నల్లా కనెక్షన్ ఇచ్చారు. పైపులు వేశారు తప్ప, నీటిని సరఫరా చేయట్లేదు. దీంతో గ్రామస్థులు చేతిపంపు, బావి నీటిపైనే ఆధారపడుతున్నారని స్థానికుడు సునీల్ తివారీ వాపోయారు. లుహారిలో ఇండ్లకు నీటి సరఫరా జరగట్లేదని గ్రామ సర్పంచ్ భాన్ సింగ్ పేర్కొన్నారు. కునాటా లోనూ ఇదే దుస్థితి ఉన్నట్టు గ్రామస్థులు వాపోయారు.
దేశవ్యాప్తంగా మొత్తం ఇండ్లు 19,23,07,608
నల్లా కనెక్షన్ కలిగిన ఇండ్లు 13,08,96,469 (68.07 శాతం)
నల్లా కనెక్షన్ లేని ఇండ్లు ్ల 6,14,11,139 (31.93 శాతం)
స్కీమ్ వ్యయం రూ. 3.6 లక్షల కోట్లు
డెడ్‌లైన్‌కు ఉన్న గడువు 3 నెలలు
స్కీమ్‌కు ముందు నల్లా కనెక్షన్లు కలిగిన ఇండ్లు 3,23,63,838 (16.83 శాతం)
గడిచిన నాలుగేండ్లలో ఇచ్చిన కనెక్షన్లు 9,85,33,631(51.24 శాతం)
ప్రస్తుత వేగంతో పనిచేస్తే, లక్ష్యాన్ని సాధించేందుకు పట్టే సమయం – దాదాపు రెండున్నరేండ్లు
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లోని చిత్రకూట్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతున్నది. పిల్లలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేకపోవడంతో అడవుల్లోని చిన్న కుంటల్లో నిల్వ ఉన్న మురికి నీటినే వస్ర్తాలతో వడబోసి అక్కడి మహిళలు తాగడానికి, వంటకు ఉపయోగిస్తున్న దారుణ ఉదంతాలు కోకొల్లలు. రాముడు నడయాడిన నేలమీద నీటి కష్టాలను ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. బుందేల్‌ఖండ్‌లోని పలు జిల్లాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో పలు గ్రామాల్లో నల్లా కనెక్షన్ లేకపోవడంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో నుంచి మహిళలు రోజూ నీళ్లు తెచ్చుకొంటున్నారు. వందలాది గ్రామాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.