సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 15:57:25

అయోధ్యలో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు

అయోధ్యలో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామమందిరం స్థ‌లంలో టైమ్ క్యాప్సూల్ (కాల నాళిక‌) ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇలాంటి వదంతుల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని ఏఎన్ఐ వార్తా సంస్థ‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న చెప్పారు. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆగ‌స్టు 5న భూమిపూజ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 

కాగా, రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను అక్కడే భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్‌ చెప్పారు. ఆలయ నిర్మాణ స్థలంలో 2,000 అడుగుల లోతున ఒక కాల నాళిక(టైమ్‌ క్యాప్సూల్‌)ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ చరిత్ర, కీలక పరిణామాల సమాచారం ఇందులో భద్రపరుస్తామని చెప్పారు. రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని చెప్పారు. 

భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ కాల నాళిక ఉపయోగపడుతుందని కామేశ్వర్‌ చౌపాల్ తెలిపారు. వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తవని ఆయ‌న చెప్పారు. కాల నాళికను తామ్ర పత్రంలో(కాపర్‌ ప్లేట్‌) ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని ఆయ‌న ‌ వివరించిన‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఇదంతా అవాస్త‌వ‌మ‌ని, రామ మందిర నిర్మాణ స్థ‌లంలో ఎలాంటి కాల నాళిక‌ను భ‌ద్ర‌ప‌ర్చ‌డం లేద‌ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇలాంటి వ‌దంతుల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు.


logo