ఆదివారం 17 జనవరి 2021
National - Jan 13, 2021 , 01:54:59

సాగు చట్టాలకు తాత్కాలిక బ్రేక్‌

సాగు చట్టాలకు తాత్కాలిక బ్రేక్‌

  • అమలును నిలిపేసిన సర్వోన్నత న్యాయస్థానం
  • సంప్రదింపులకు నలుగురు సభ్యుల కమిటీ
  • వారంతా కొత్త చట్టాలను సమర్థించినవాళ్లే
  • మేం ఆ కమిటీ ముందుకు వెళ్లే ప్రసక్తి లేనే లేదు
  • కోర్టును కొన్ని శక్తులు తప్పుదోవ పట్టించాయి
  • కమిటీ వెనుక కేంద్ర హస్తం: రైతు సంఘాలు
  •  ట్రాక్టర్‌ ర్యాలీపై సంఘాలకు సుప్రీం నోటీసులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నూతన వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా వేలమంది రైతులు నెలన్నర రోజులుగా నిరసనోద్యమం చేస్తుండటంతో సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో సంప్రదింపుల కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీలోని సభ్యులంతా ఈ చట్టాలను సమర్థించినవాళ్లేనని, కాబట్టి ఆ కమిటీ ముందుకు వెళ్లబోమని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. చట్టాలను పూర్తిగా రద్దుచేసేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశాయి. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాము చేపట్టనున్న ట్రాక్టర్‌ ర్యాలీ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించాయి. కమిటీని నియమించటంలో కొన్ని శక్తులు కోర్టును తప్పుదోవ పట్టించాయని రైతు నేతలు ఆరోపించారు. ఈ పరిణామం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు.

న్యూఢిల్లీ, జనవరి 12: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ఈ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలమంది రైతులు 49 రోజులుగా నిరసనోద్యమం చేస్తుండటంతో సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో సంప్రదింపుల కమిటీని నియమించింది. సమస్య పరిష్కారమయ్యే వరకు చట్టాల ను నిలిపేసే అధికారం కోర్టుకు ఉన్నదని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు ఏఎస్‌ బోపన్న, వీ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. 26న రైతు సంఘా ట్రాక్టర్‌ ర్యాలీని ఆపించాలన్న కేంద్రం విజ్ఞప్తిపై రైతు సంఘాలకు నోటీసులిచ్చింది. కోర్టు నియమించిన కమిటీలోని సభ్యులు గతంలో చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవాళ్లేనని.. ఆ కమిటీ ముందుకు వెళ్లబోమని రైతు సంఘాలు స్పష్టంచేశాయి.

అందరూ సహకరించండి

పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకే సంప్రదింపుల కమిటీ వేశామని ధర్మాసనం తెలిపింది. సమస్య పరిష్కారానికి అందరూ సహకరించాలని కోరింది. రైతు సంఘాలతో చర్చలు జరిపేలా ప్రధానిని ఆదేశించాలన్న రైతుల తరఫు న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ‘ఇది రాజకీయం కాదు. ప్రధానికి ఆదేశాలిచ్చే అధికారం మాకు లేదు. ఎందుకంటే ఈ విచారణలో ఆయన భాగం కాదు. సమస్య పరిష్కారం కావాలని కోరుకునేవాళ్లంతా కమిటీ ముందుకు వెళ్లండి’ అని స్పష్టంచేసింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భూపిందర్‌ సింగ్‌ మన్‌, మహారాష్ట్రకు చెందిన షెత్కారీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ ఘన్‌వత్‌, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ దక్షిణాసియా విభాగం మాజీ డైరెక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషి, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్‌ గులాటీలతో కమిటీ వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. 

కమిటీ ముందుకు వెళ్లం

చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని రైతు సంఘాలు స్వాగతించాయి. కమిటీ నియామకంపై అనుమానాలు వ్యక్తంచేశాయి. ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ సమితి (ఏఐకేసీసీ) నేతలు మీడియాతో మాట్లాడారు. ‘కమిటీ వేసే విషయంలో కూడా కోర్టును కొన్ని శక్తులు తప్పుదోవ పట్టించినట్టు అర్థమవుతున్నది. ఈ పరిణామం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉన్నదని భావిస్తున్నాం. ఇప్పటికే చట్టాలకు అనుకూలంగా మాట్లాడిన కమిటీ సభ్యులు సమదృష్టితో చూస్తారన్న నమ్మకం లేదు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కమిటీని ముందుకు తెచ్చారు’ అని ఏఐకేసీసీ పేర్కొంది. కమిటీ సభ్యుల నేపథ్యమిదీ..

బీకేయూ అధ్యక్షుడిగా ఉన్న భూపిందర్‌ సింగ్‌ మన్‌.. నూతన సాగు చట్టాలను స్వాగతిస్తున్నారు. భారత వ్యవసాయ మార్కెటింగ్‌ రంగంలో సంస్కరణలు తేవాలని గట్టిగా వాదిస్తున్న ఆర్థికవేత్తల్లో అశోక్‌ గులాటీ ఒకరు. అనిల్‌ ఘన్‌వత్‌ కూడా చట్టాల రద్దును వ్యతిరేకిస్తున్నారు. ప్రమోద్‌ కుమార్‌ జోషి వ్యవసాయ మార్కెటింగ్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థలను తీసుకురావాలని బలంగా వాదిస్తున్నారు.

రైతుల పాక్షిక విజయం: మంత్రి నిరంజన్‌రెడ్డి 

నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతుల పాక్షిక విజయమని అన్నారు. చట్టాలపై సమీక్షకు నిపుణుల కమిటీ వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. వ్యవసాయం రాష్ర్టాలకు సంబంధించిన సబ్జెక్టు అని, ఈ కమిటీలో అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.