సోమవారం 25 మే 2020
National - Mar 30, 2020 , 01:35:12

జిల్లాలు లాక్‌డౌన్‌

జిల్లాలు లాక్‌డౌన్‌

-వలస కార్మికుల సంచారాన్ని నియంత్రించండి

-ఇప్పటికే వెళ్లినవారిని క్వారంటైన్‌లో ఉంచండి

-కార్మికుల నుంచి ఇంటి కిరాయి వసూలు చేయరాదు

-బలవంతంగా ఖాళీ చేయించేవారిపై చర్యలు 

-రాష్ర్టాలకు కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి ఆదేశాలు

న్యూఢిల్లీ, మార్చి 29: వలస కార్మికుల సంచారాన్ని నియంత్రించేందుకు జిల్లాలు, రాష్ర్టాల సరిహద్దులను మూసివేయాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి స్వస్థలాలకు బయలుదేరిన కార్మికులకు స్క్రీనింగ్‌ నిర్వహించి 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలని స్పష్టంచేసింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌బల్లా ఆదివారం అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలుచేయాలని ఆదేశించారు. నగరాల మధ్య, జాతీయ రహదారులపై జనసంచారం లేకుండా చూడాలని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా బాధ్యతలు తీసుకుని ఈ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. వలస కూలీలకు వారు పనిచేస్తున్న చోటునే భోజనం, వసతి సదుపాయం కల్పించాలని సీఎస్‌లు, డీజీపీలకు సూచించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల నుంచి లక్షలాది మంది కార్మికులు అనేక అవస్థలు పడుతూ స్వస్థలాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే వారి ద్వారా వైరస్‌ మరింత వ్యాప్తిచెందే ప్రమాదమున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. వలస కూలీలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరింది. వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని రాష్ర్టాలకు సూచించింది. ఇందుకోసం ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులను వాడుకోవచ్చని తెలిపింది. 

బలవంతం చేస్తే కఠిన చర్యలు..

కార్మికులకు ఎలాంటి కోతలు లేకుండా సకాలంలో జీతాలు అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను కోరింది. అలాగే ఇంటి అద్దె కోసం వారిపై యజమానులు ఒత్తిడి తేకుండా చూడాలని సూచించింది. కార్మికులను, విద్యార్థులను బలవంతంగా ఖాళీచేయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

అడ్డుకుంటున్న సొంతూర్ల ప్రజలు

నేపాల్‌, భూటాన్‌ వంటి పొరుగు దేశాలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి సొంతూర్లకు చేరుకుంటున్న వలస కార్మికులను బీహార్‌లోని పలు గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొత్తవారు గ్రామాల్లోకి రాకుండా ఇప్పటికే ఊరి సరిహద్దులను మూసివేశారు. ఈ నేపథ్యంలో సొంత గ్రామాలకు వచ్చే వలస కార్మికులను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో అంబులెన్స్‌ల్లో అక్కడికి చేరుకుంటున్న వైద్య సిబ్బంది, అధికారులు వారిని దవాఖానలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

వలస కార్మికులు వెళ్లకండి: ఉద్ధవ్‌ఠాక్రే

వలస కూలీలు రాష్ర్టాన్ని విడిచి వెళ్లొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కోరారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరారు. కార్మికులకు భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 163 కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. శివ్‌భోజనం పథకం కింద ఏప్రిల్‌ 1 నుంచి రూ.5కే భోజనం అందిస్తామని చెప్పారు. మరోవైపు వలస కార్మికులు ఢిల్లీని వీడవద్దని, లేనిపక్షంలో మీతోపాటు మీ గ్రామాలు, కుటుంబాలకు వైరస్‌ సోకే ప్రమాదమున్నదని సీఎం కేజ్రీవాల్‌ హెచ్చరించారు. భోజనం, వసతి వంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినతి మేరకు ఢిల్లీ-ఘజియాబాద్‌ సరిహద్దు ప్రాంతాలకు చేరిన వేలాది మంది వలస కూలీలను 825 బస్సుల్లో వారి స్వగ్రామాలకు తరలిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు యూపీ సర్కారు 1500 బస్సులను ఏర్పాటుచేసింది. ఆకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంవల్ల వలస కూలీలు భయం, గందరగోళానికి లోనవుతున్నారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు. దేశంలోని పరిస్థితులు భిన్నమైనవని, ఇతర దేశాల్లో అనుసరించిన లాక్‌డౌన్‌ మాదిరిగా కాకుండా కరోనా నియంత్రణ చర్యలను వివిధ దశల్లో చేపట్టాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. logo