గురువారం 16 జూలై 2020
National - Jun 16, 2020 , 13:04:20

మద్యానికి బానిసైన మంకీ.. 250 మందిపై దాడి

మద్యానికి బానిసైన మంకీ.. 250 మందిపై దాడి

లక్నో : మద్యం సేవించిన మనషులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఒక వేళ మద్యం దొరక్కపోతే వితంగా ప్రవర్తిస్తూ.. పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఓ కోతి కూడా ప్రతి రోజూ మద్యం సేవిస్తూ వచ్చింది. తీరా దానికి మద్యం అందుబాటులో లేకపోయేసరికి.. మనషులపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గత మూడేళ్ల నుంచి ఆ వానరం జూలో బంధీగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గత ఆరేళ్ల క్రితం కలువా అనే కోతి పుట్టింది. దాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. అయితే అతనికి రోజు మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతి రోజూ.. తాను తెచ్చుకున్న మద్యంలో కొంచెం.. కోతికి కూడా పోసేవాడు. దీంతో ఆ వానరం కూడా మద్యానికి బానిస అయింది. ఆ తర్వాత కోతి యజమాని చనిపోయాడు. దానికి మద్యం కరువైంది. 

కల్లు తాగిన కోతి కుదురుగా ఉండదన్నట్లు.. మద్యం లేని కోతి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మీర్జాపూర్‌ ప్రజలపై కోతి దాడి చేస్తూ సుమారు 250 మందిని గాయపరిచింది. చివరకు దాని దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడు కూడా. కోతిని అడ్డుకునేందుకు ఎవరూ సాహసం చేయలేదు.

మొత్తానికి ఫారెస్ట్‌ అధికారులు.. ఎన్నో కష్టాలు పడి ఆ కోతిని బంధించారు. తర్వాత కాన్పూర్‌ జూపార్క్‌కు కోతిని తరలించారు. గత మూడేళ్ల నుంచి జూలో కోతిని ప్రత్యేకంగా ఉంచి ఆహారం ఇచ్చి.. మచ్చిక చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ కోతి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కేజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత గతం లాగే కోతి దురుసుగా ప్రవర్తిస్తుంది. దాడికి ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆ కోతిని ప్రత్యేక కేజ్‌లోనే బంధించాలని జూ సిబ్బంది నిర్ణయించారు. 


logo