బుధవారం 03 జూన్ 2020
National - Apr 01, 2020 , 00:39:08

ప్రిస్క్రిప్షన్‌తో మద్యం

ప్రిస్క్రిప్షన్‌తో మద్యం

  • కేరళ సర్కార్‌ ఉత్తర్వులు

తిరువనంతపురం: మద్యం తాగకుండా ఉండలేనివారికి కేరళ ప్రభుత్వం ఊరట కల్పించింది. మద్యం ఇచ్చేందుకు ప్రత్యేక పాస్‌లు జారీచేయనున్నట్టు ప్రకటించింది. అయితే, మద్యానికి బానిస అయినట్టుగా వైద్యుడి దగ్గరి నుంచి ధ్రువపత్రం (ప్రిస్క్రిప్షన్‌ లెటర్‌) తీసుకురావాలని షరతు విధించింది. వారికి మాత్రమే మద్యం విక్రయిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. మద్యానికి బానిసైనవారు అదిలేక మతితప్పినట్టు ప్రవర్తిస్తున్నారు. మద్యం దొరక్క కేరళలో సోమవారం ఒక్కరోజే తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఏడుగురు ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు గుండెపోటుతో మరణించారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారులను సంప్రదించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. వైద్యుల నుంచి అనుమతి పొందినవారికి మద్యం ఇవ్వాలని నిర్ణయించారు. మద్యం లేకుండా ఉండలేనిస్థితిలో ఉన్నారని ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుల నుంచి ప్రిస్క్రిప్షన్‌ తీసుకొస్తే ఎక్సైజ్‌శాఖ అధికారులు తగిన మోతాదులో మాత్రమే మద్యం ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే, కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది పూర్తిగా అశాస్త్రీయమని పేర్కొన్నది.


logo