మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 02:56:01

ఐశ్వర్యకు కరోనా

ఐశ్వర్యకు కరోనా

  • కుమార్తె ఆరాధ్యకు కూడా
  • ఇప్పటికే దవాఖానలో అమితాబ్‌, అభిషేక్‌
  • అనుపమ్‌ ఖేర్‌ ఫ్యామిలీలోనూ నలుగురికి 
  • మరికొంత మంది ప్రముఖ నటులకూ..!

ముంబై: కరోనా వైరస్‌ బాలీవుడ్‌లో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నది. బిగ్‌బీ అమితాబ్‌ కుటుంబం కరోనా గుప్పిట్లో చిక్కుకున్నది. అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌లకు శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అదే కుటుంబానికి చెందిన ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌, ఆమె కూతురు ఆరాధ్య కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. మరో విలక్షణ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. ఐశ్యర్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఆదివారం వెల్లడించారు. 

కరోనా పరీక్షల్లో ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్‌ వచ్చిందని, జయాబచ్చన్‌కు నెగెటివ్‌ వచ్చిందని ట్వీట్‌ చేశారు. అయితే తర్వాత ఆయన ట్వీట్‌ను తొలిగించారు. అనంతరం ‘ఐశ్వర్య, ఆరాధ్యలకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. వారు ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు’ అని అభిషేక్‌ బచ్చన్‌ వెల్లడించారు. అంతకుముందు ఇద్దరికీ యాంటిజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావడం గమనార్హం. నానావతి దవాఖానలో చికిత్స పొందుతున్న అమితాబ్‌, అభిషేక్‌ ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. కాగా, అమితాబ్‌ త్వరగా కోలుకోవాలని కోల్‌కతాలోని ఆయన అభిమానులు స్థానిక శివాలయంలో యజ్ఞాన్ని నిర్వహించారు. 

అనుపమ్‌ ఖేర్‌ తల్లి, సోదరుడికి కరోనా

బాలీవుడ్‌ విలక్షణ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తల్లి, సోదరుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అనుపమ్‌ ఖేర్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తన వదిన, మేనకోడలు కూడా కరోనా బారిన పడ్డారని తెలిపారు. 0బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులకు కరోనా సోకిందని ఆదివారం ఉదయం వదంతులు వ్యాపించాయి. సీనియర్‌ నటి హేమామాలిని దవాఖానలో చేరారన్న వదంతులపై ఆమె స్పష్టతనిచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ట్వీట్‌ చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌, నీతూకపూర్‌లకు కరోనా సోకినట్లు వచ్చిన వదంతులపై ప్రముఖ డిజైనర్‌, రణ్‌బీర్‌ సోదరి రిద్దిమా కపూర్‌ సాహ్ని స్పందించారు. ‘దయచేసి ఎవరూ వదంతులను వ్యాపింపజేయవద్దు’ అని కోరారు.logo