మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 17:38:42

రిఫండ్‌ ఆలస్యమైతే ఎయిర్‌లైన్‌ సంస్థలు వడ్డీ చెల్లించాలి

రిఫండ్‌ ఆలస్యమైతే ఎయిర్‌లైన్‌ సంస్థలు వడ్డీ చెల్లించాలి

న్యూఢిల్లీ: విమాన చార్జీల రిఫండ్‌ ఆలసమ్యమైతే ఎయిర్‌లైన్‌ సంస్థలు సంబంధిత బాధితులకు 0.5 శాతం మేర వడ్డీ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సుమారు మూడు నెలలపాటు దేశీయ విమాన సర్వీసులు నిలిచిపోగా అంతర్జాతీయ సర్వీసులను ఇంకా పూర్తిగా పునరుద్ధరించలేదు. అయితే లాక్‌డౌన్‌ కాలంలో ప్రయాణాలకు ముందస్తుగా టికెట్లు బుకింగ్‌ చేసుకున్న విమాన ప్రయాణికులు రిఫండ్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై బుధవారం విచారణ సందర్భంగా డీజీసీఐ తరుఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు హాజరయ్యారు. రిఫండ్‌ ఆలస్యంగా చెల్లించే ఎయిర్‌లైన్‌ సంస్థలు 0.5 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని కోర్టుకు చెప్పారు. పరిస్థితులు అనుకూలించకపోయినా భారాన్ని ఎవరో ఒకరు భారించాలని అన్నారు.

అయితే ఎయిర్‌ ఏషియా, విస్తారా వంటి సంస్థలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కాగా లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించిన టికెట్ల రిఫండ్‌ను తాము పూర్తిగా చెల్లించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. మరోవైపు రిఫండ్‌ పద్ధతులపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo