సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 12:50:18

వుహాన్‌, జపాన్‌ నుంచి భారతీయుల తరలింపు

వుహాన్‌, జపాన్‌ నుంచి భారతీయుల తరలింపు

న్యూఢిల్లీ : కరోనా కలకలం నేపథ్యంలో జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో కొన్ని రోజుల పాటు చిక్కుకున్న భారతీయులతో పాటు మరో ఐదుగురు విదేశీయులు సురక్షితంగా ఢిల్లీకి ఇవాళ ఉదయం చేరుకున్నారు. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రభావంతో ఫిబ్రవరి 3 నుంచి యోకోహోమా పోర్టులో నిలిపివేసిన ఈ నౌకలోని 3711 మందిలో 138 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 16 మందికి కరోనా వైరస్‌ సోకగా వారిని జపాన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా 119 మందితో పాటు శ్రీలంక, నేపాల్‌, సౌతాఫ్రికా, పెరూ దేశాలకు చెందిన ఐదుగురు కూడా సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. 119 మంది భారతీయులతో పాటు ఐదుగురు విదేశీయులతో ఎయిరిండియా విమానం టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయుల తరలింపుకు సహకరించిన జపాన్‌ అధికార వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిరిండియాకు మరోసారి జైశంకర్‌ ధన్యవాదాలు చెప్పారు. 

వుహాన్‌ నుంచి 112 మంది తరలింపు

ఇక చైనాలోని వుహాన్‌ నుంచి కూడా ఇవాళ ఉదయం 112 మందిని భారత్‌కు తరలించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం 76 మంది భారతీయులతో పాటు 36 మంది విదేశీయులను ఢిల్లీకి తరలించింది. కరోనాతో అతలాకుతలం అవుతున్న చైనాకు భారత్‌ సాయమందించిన విషయం విదితమే. 15 టన్నుల వైద్య పరికరాలతో కూడిన ఎయిర్‌ఫోర్స్‌ విమానాన్ని బుధవారం చైనాలోని వుహాన్‌కు పంపారు భారత అధికారులు. తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకున్న 76 మంది భారతీయులు, 36 మంది విదేశీయులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వీరందరిని ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో భారత్‌ - టిబెట్‌ సరిహద్దు భద్రత దళం ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


logo