గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 02:35:52

ప్రాణాలు కాపాడిన పైలట్‌

ప్రాణాలు కాపాడిన పైలట్‌

  • కూలిపోవటానికి ముందే ఇంధనం అయిపోయేలా విమానం చక్కర్లు 
  • అందుకే ముక్కలైనా విమానం పేలలేదు 
  • పేలి ఉంటే 190 మందీ చనిపోయేవారు 

ముంబై: విషమ పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించడం అందరికీ సాధ్యంకాదు. శుక్రవారం కోజికోడ్‌లో విమానం క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యేకంటే ముందే పైలట్‌ దీపక్‌ సాథె అప్రమత్తమయ్యారు. కూలిపోయిన తర్వాత విమానంలో మంటలు రేగే అవకాశం ఉండటంతో ఇంధనం పూర్తిగా అయిపోయేలా విమానాశ్రయం చుట్టూ మూడుసార్లు విమానాన్ని తిప్పారు. విమానం రన్‌వేపై జారిపోవడానికి ముందే ఆయన విమానం ఇంజిన్‌ను ఆఫ్‌ చేశారు. అందుకే ప్రమాదం జరిగినప్పటికీ విమానంలో మంటలు చెలరేగలేదని, దీనివల్లే ప్రాణ నష్టం భారీగా తగ్గిందని దీపక్‌ వరుస సోదరుడు (కజిన్‌) నీలేశ్‌ సాథె తన ఫేస్‌బుక్‌ పోస్టులో వెల్లడించారు. విమానం పేలి ఉంటే దాంట్లోని 190 మందీ మరణించి ఉండేవారు. కాగా, ‘విమానాలను నడుపడంలో 36 సంవత్సరాల అనుభవం ఉన్న దీపక్‌కు 1990లో ఓ విమాన ప్రమాదం నుంచి తృటిలో ప్రాణహాని తప్పింది. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన మళ్లీ విమానాలను నడుపడం కుదరదని వైద్యులు చెప్పారు. కానీ, మనోధైర్యంతో కేవలం ఆరు నెలల్లోనే తిరిగి కోలుకొని మళ్లీ పైలట్‌ కావాలన్న కలను దీపక్‌ సాకారం చేసుకున్నారు’ అని నీలేశ్‌ తెలిపారు.  

తల్లికి బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇద్దామని!

‘వందే భారత్‌ మిషన్‌' విధుల్లో తీరికలేకుండా ఉన్న దీపక్‌ శనివారం (ఆగస్టు 8) నాగ్‌పూర్‌కు వెళ్లాలనుకున్నారు. ఆరోజు తన మాతృమూర్తి 84వ పుట్టినరోజు. తాను స్వయంగా వెళ్లి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాలని దీపక్‌ భావించినట్టు ఆయన మేనల్లుడు డాక్టర్‌ యశోధన్‌ తెలిపారు. అయితే ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని విలపించారు.


logo