ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 19:52:58

సరిహద్దులో అపాచీ, చినూక్ లతో గస్తీ

సరిహద్దులో అపాచీ, చినూక్ లతో గస్తీ

లడఖ్ : భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను భారత వైమానిక దళం కట్టుదిట్టం చేసింది. సుఖోయ్‌ 30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌ యుద్ధవిమానాలకు తోడుగా అపాచీ హెలికాఫ్టర్లు కూడా రౌండ్లు కొడుతున్నాయి. భారీ బరువులను మోసుకెళ్లగల చినూక్‌లు కూడా రంగంలోకి దిగాయి. చైనా ఏ మాత్రం తోక జాడించినా గట్టిగా బుద్ధి చెప్తామన్న సంకేతాలను భారత వాయుసేన పంపుతున్నది. లడఖ్ తో పాటు టిబెట్‌ రీజియన్‌లోని లేహ్‌, శ్రీనగర్‌, అవంతీపూర, బరేలి, అదమ్‌పూర్‌, హల్వారా, సిర్సా తదితర విమాన స్థావరాల్లో దళాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి.

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి మళ్లినప్పటికీ.. భారత్ అప్రమత్తతను కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో వైమానికదళం సైతం గస్తీని చేపడుతోంది. వైమానిక దళానికి చెందిన అపాచీ, చినూక్ ఫైటింగ్ హెలికాప్టర్లు, మిగ్- 17, మిగ్- 29, ఏఎన్-23 యుద్ధ విమానాలు కశ్మీర్​, ఉత్తరాఖండ్​ల్లోని ఎయిర్‌ బేస్‌ల నుంచి రాత్రివేళ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా రాత్రి వేళ కూడా తిప్పికొట్టేందుకే ఈ సన్నాహాలు చేపట్టినట్లు సమాచారం.

వైమానిక దాడుల్లో అపాచీది కీలకపాత్ర

అపాచీ హెలికాప్టర్ నేల నుంచి గాలిలోకి నిలువుగా గరిష్టంగా నిమిషానికి 2,800 మీటర్ల వేగంతో లేస్తుంది. ఏకబిగిన మూడు గంటల పాటు ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 261 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి ఇంధనం నింపితే ఆపకుండా 1,900 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. బులెట్లు, బాంబులు, క్షిపణులను ప్రయోగించేవీలుంది. హెలికాప్టర్ కింద ఉన్న రైఫిల్‌లో ఒకసారి 1,200 రౌండ్ల 30ఎంఎం బులెట్లను లోడ్ చేసే వీలుంది. శత్రువు భూభాగంలో కూడా నిఘా ఆపరేషన్లు నిర్వహించగలదు. అన్ని రకాల వాతావరణాల్లో, అన్ని రకాల భూభూగాల్లో ప్రయాణించగలదు. దాడులు చేయగలదు. ఒక్కో హెలికాప్టర్‌ను నడపటానికి ఇద్దరు పైలట్లు అవసరమవుతారు. ఈ హెలికాప్టర్లో రెండు ఇంజిన్లు ఉండటం వల్ల దీని వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ హెలికాప్టర్‌ ను రాడార్ మీద పసిగట్టటం చాలా కష్టమైన పని.

బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేసిన ఈ హెలికాప్టర్లు.. 2019 సెప్టెంబర్ నెలలో భారత వాయుసేనలో చేరి వాయుసేన అమ్ములపొదను మరింత పటిష్ఠం చేశాయి. భారత వాయుసేన వద్ద ఇప్పుడు 17 అపాచీ హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరో ఆరు అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం 2017 లో అమెరికా, బోయింగ్ కంపెనీతో రూ.4,168 కోట్ల ఒప్పందం కూడా చేసుకొన్నది.   పఠాన్ కోట్ వైమానిక స్థావరంలో ఇప్పటికే నాలుగు అపాచీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. చైనాతో ఘర్షణ నేపథ్యంలో మిగతా అపాచీ హెలికాప్టర్లను త్వరగా అందజేయాలని భారత ప్రభుత్వం అమెరికాను కోరుతున్నది.


logo