ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 23:10:01

రాఫెల్ రావడంలో హిలాల్ అహ్మద్ పాత్ర కీలకం

రాఫెల్ రావడంలో హిలాల్ అహ్మద్ పాత్ర కీలకం

న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్ ఫైటర్లు భారత్ రావడంలో ఐఏఎఫ్ సీనియర్ అధికారి ఎయిర్ కమోడోర్ హిలాల్ అహ్మద్ రాథర్ పాత్ర ఎంతో కీలకమైనది. కశ్మీర్ కు చెందిన హిలాల్ అహ్మద్ ప్రస్తుతం ఫ్రాన్స్‌కు ఎయిర్ అటాచ్‌గా పనిచేస్తున్నారు. ఈయన కారణంగానే ఫ్రాన్స్ నుంచి అనుకున్న సమయానికి రాఫెల్ యుద్ధవిమానాలు అంబాలాకు చేరుకుంటున్నాయి.

పంజాబ్లోని అంబాలా వైమానిక దళం స్టేషన్‌లో మొదటి బ్యాచ్ డసాల్ట్ రాఫెల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రాఫ్‌తో కలిసి ఎయిర్ కమోడోర్ హిలాల్ అహ్మద్ జూలై 27 న ఫ్రాన్స్ నుంచి విమానాలు టేకాఫ్ చేయడాన్ని పర్యవేక్షించారు.

దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన ఈయన 1988 డిసెంబర్ 17 న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో ఫైటర్ పైలట్‌గా  నియమితులై.. ఎయిర్ కమోడోర్ వరకు ఎన్నో పదోన్నతులు పొందారు. 2010 లో వాయుసేన పతకాన్ని, 2016 లో గ్రూప్ కెప్టెన్‌గా విశిష్త్ సేవా పతకాన్ని పొందారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. 

రాఫెల్ విమానాల రాక దశాబ్దాల సేకరణ ప్రక్రియను ఫలవంతం కావడంలో హిలాల్ అహ్మద్ కీలక పాత్ర పోషించినట్లు చెప్తారు. అత్యవసర కొనుగోలు మార్గంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలుకు భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది.

హిలాల్ అహ్మద్ మిగ్ -21, మిరాజ్ -2000, కిరణ్ విమానాలలో 3,000 గంటలకు పైగా ప్రమాద రహిత ఫ్లయింగ్ కలిగి ఉన్నారు. అతను ఫైటర్ కంబాట్ లీడర్, అర్హతగల ఫ్లయింగ్ బోధకుడు. అమెరికాలోని ఎయిర్ వార్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు.

గత అక్టోబర్‌ నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాంప్రదాయ హిందూ “అస్త్రపూజ” నిర్వహించేందుకు సహాయం చేసిన ఇద్దరు ఐఏఎఫ్ అధికారులలో హిలాల్ అహ్మద్ ఒకరు. మొదటి రాఫెల్ ఫైటర్ జెట్‌ను అధికారికంగా స్వీకరించి వినుతికెక్కారు.


logo