డిసెంబర్ 8 నుంచి సరుకుల రవాణా బంద్

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించింది ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ). డిసెంబర్ 8 నుంచి ఉత్తర భారతదేశంలో సరుకు రవాణా వాహనాలను బంద్ చేస్తున్నట్లు ఏఐఎంటీసీ స్పష్టం చేసింది. ఆ చట్టాలను రద్దు చేయకపోతే మొత్తం దేశవ్యాప్తంగా సరుకు రవాణాను నిలిపేస్తామని హెచ్చరించింది. దేశంలో సుమారు కోటి సరుకు రవాణా వాహనాల ఆపరేటర్లు ఈ ఏఐఎంటీసీలో సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 8 నుంచి ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్, జమ్ముకశ్మీర్తోసహా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తమ వాహనాలను నిలిపివేస్తున్నట్లు ఏఐఎంటీసీ అధ్యక్షుడు కుల్తరన్ సింగ్ అత్వాల్ చెప్పారు.
అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే.. దేశవ్యాప్తంగా సరుకు రవాణాను నిలిపేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధానిలో వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్లు ఏఐఎంటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్డు రవాణాలాగే వ్యవసాయ రంగం కూడా దేశానికి వెన్నెముకలాంటిదని ఆ ప్రకటనలో ఏఐఎంటీసీ పేర్కొన్నది. ఇప్పటికే రైతుల ఆందోళన వల్ల ఢిల్లీలో నిత్యావసరాల కొరత ఏర్పడుతోందని, ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకపోతే ఇది మరింత ముదిరే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.