న్యూఢిల్లీ : అన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పదవులను ముస్లింలకు కేటాయించాలని ఏఐఎంఐఎం నేత అసిం వకార్ విపక్షాలను కోరారు. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు ఈ అంశంపై తమ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీల నేతలు ఓట్ల కోసం ముస్లింల వద్దకు వస్తున్నారని, ముస్లింలు డిప్యూటీ సీఎం పదవి కోరితే వారికి సమస్యగా మారుతోందని అసిం వకార్ అన్నారు.
రాజకీయ పార్టీలు నేడో రేపో ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు వకార్ డిమాండ్‌ను కాంగ్రెస్ నేత రషీద్ అల్వి తోసిపుచ్చారు. ఇలాంటి మతపరమైన ప్రకటనలు కాషాయ పార్టీకి లాభిస్తాయని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ గుర్తెరగాలని వ్యాఖ్యానించారు. మీరు ముస్లింల బాగును కాంక్షిస్తే యూపీ రాజకీయాలకు దూరంగా ఉండాలని అల్వీ హితవు పలికారు.