సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 12:55:27

చాకును మింగిన వ్య‌క్తి.. శ‌స్త్ర‌చికిత్స చేసి తీసిన వైద్యులు

చాకును మింగిన వ్య‌క్తి.. శ‌స్త్ర‌చికిత్స చేసి తీసిన వైద్యులు

న్యూఢిల్లీ: డ్ర‌గ్స్‌కు బానిస అయిన ఒక వ్య‌క్తి ఏకంగా చాకును మింగాడు. నెల‌న్న‌ర త‌ర్వాత అత‌డికి క‌డుపులో నొప్పి రావ‌డంతో గుర్తించిన వైద్యులు శ‌స్త్ర‌చికిత్స చేసి తొల‌గించారు. హ‌ర్యానాకు చెందిన 28 ఏండ్ల వ్య‌క్తి డ్ర‌గ్స్‌కు బానిస అయ్యాడు. ఒక రోజు మ‌త్తుప‌దార్థాలు ల‌భించ‌క‌పోవ‌డంతో వంట‌గ‌దిలోని కూర‌గాయ‌లు త‌రిగే చాకును మింగాడు. నెల రోజుల వ‌ర‌కు బాగానే ఉన్నాడు. ఈ నెల 12న క‌డుపులో నొప్పిగా ఉన్న‌ద‌ని అత‌డు చెప్ప‌డంతో కుటుంబ స‌భ్యులు ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. ఆ వ్య‌క్తి క‌డుపును ఎక్స్‌రే తీసిన వైద్యులు లోప‌ల 20 సెంటీమీట‌ర్ల పొడ‌వైన చాకు ఉండ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌డ్ని ఎయిమ్స్ ద‌వాఖాన‌కు రిఫర్  చేశారు. 

ఢిల్లీ ఎయిమ్స్ ద‌వాఖాన డాక్ట‌ర్లు తొలుత అత‌డికి క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించారు. నెగిటివ్ వ‌చ్చిన త‌ర్వాత అత‌డి క‌డుపును ప‌రిశీలించారు. అత‌డు మింగిన చాకు కాలేయం స‌మీపం వ‌ద్ద ఉన్న‌ట్లు గుర్తించారు. శ‌స్త్ర‌చికిత్స చేయ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న‌ద‌ని వారు భావించారు. చిన్న పొర‌పాటు జ‌రిగినా రోగి ప్రాణానికి ముప్పు అని చెప్పారు. అయితే అక్క‌డి వైద్యులు దీన్ని స‌వాల్‌గా తీసుకున్నారు. శ‌స్త్ర‌చికిత్స కోసం రోగిని మాన‌సికంగా సిద్ధం చేశారు. డాక్ట‌ర్ ఎన్ఆర్ దాస్ ఆధ్వ‌ర్యంలోని వైద్యులు ఈ నెల 19న మూడు గంట‌ల‌పాటు శ్ర‌మించారు. శ‌స్త్ర‌చికిత్స చేసి అత‌డి క‌డుపులోని చాకును సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు. ప్ర‌స్తుతం అత‌డు కోలుకుంటున్నాడ‌ని, ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉన్న‌ద‌ని డాక్ట‌ర్ దాస్ తెలిపారు.logo