ఆదివారం 07 జూన్ 2020
National - Mar 29, 2020 , 01:37:55

వలస కార్మికులకు సహాయ శిబిరాలు

వలస కార్మికులకు సహాయ శిబిరాలు

  • ఏర్పాటుచేయాలని రాష్ర్టాలను కోరిన కేంద్రం
  • తాత్కాలిక వసతి, భోజనం అందించాలని సూచన
  • ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులను ఉపయోగించుకోవచ్చని వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో తీవ్రంగా ప్రభావితమైన వలస కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కార్మికుల కోసం తక్షణమే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. వారికి తాత్కాలిక వసతి, భోజన సదుపాయం కల్పించడంతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది.  ఇందుకోసం ఎస్డీఆర్‌ఎఫ్‌ (రాష్ట్ర విపత్తు సహాయ నిధి) నిధులను వాడుకోవచ్చని తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. రవాణా సేవలు నిలిచిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వందల కిలోమీటర్లు కాలినడక సాగించి స్వస్థలాలకు వెళ్తున్నారు. వలస కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. కార్మికుల సమస్యలపై రాష్ర్టాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. వలస కార్మికులకు భోజనం, నీరు అందించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధిపతి, టోల్‌ ఆపరేటర్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ కోరారు. సరిహద్దు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు 1000 బస్సులను ఏర్పాటుచేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.


logo