శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 22, 2020 , 13:28:42

ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేల వాకౌట్

ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేల వాకౌట్

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ని తొలగించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే బడ్జెట్ సమావేశం ప్రారంభం సందర్భంగా ప్రసంగించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అసెంబ్లీకి హాజరుకాలేదు. దీంతో ఏఐఏడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాల నుంచి  వాకౌట్ చేశారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ ప్రసంగం గురించి సోమవారం తెల్లవారుజామున 3.30కి లేఖ అందిందని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశానికి మరో తేదీని ఖరారు చేయాలంటూ సీఎం నారాయణ స్వామికి లేఖ రాశారు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక శాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి నారాయణస్వామి సోమవారమే అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

కాగా, లెఫ్టినెంట్ గవర్నర్‌ కిరణ్ బేడీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించకపోవడం, ఆమె ఆమోదం లేకుండానే సీఎం నారాయణస్వామి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష అన్నాడీఎంకే మండిపడింది. ఈ నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వాన్ని రద్దు చేయడంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్‌‌‌ను కేంద్రం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు.




logo