గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 08:57:53

నిత్యావ‌స‌రాలు అమ్మేవారిలో 700 మందికి క‌రోనా

నిత్యావ‌స‌రాలు అమ్మేవారిలో 700 మందికి క‌రోనా

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్ రాష్ట్రం అహ్మదాబాద్ న‌గ‌రం‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముకునేవారిలో 700 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అహ్మ‌దాబాద్ అధికారులు ప్ర‌త్యేకించి నిత్యావ‌స‌రాలు అమ్ముకునే వారికి వారం రోజుల‌పాటు భారీ స్థాయిలో క‌రోనా నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారిలో 700 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో వారిని ‘సూపర్ ‌స్ప్రెడర్స్‌’ (వైరస్‌ను విస్తృతంగా వ్యాప్తి చేసేవారు) గా గుర్తించారు. మే 7 నుంచి 14 వరకు పాల డెయిరీలు, మెడిక‌ల్‌ షాపులు మినహా మిగిలిన అన్నింటినీ మూసివేసి ఈ పరీక్షలు జరిపారు. 

సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌గా తేలిన వారిలో కూరగాయలు అమ్ముకునేవారు, కిరాణం దుకాణ‌దారులు, పాలు అమ్మేవారు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేవారు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో మొత్తం 33,500 మందిని స్క్రీనింగ్‌ చేసి అందులో 12,500 మందికి కరోనా పరీక్షలు నిర్వ‌హించామ‌ని, అందులో 700 మందికి క‌రోనా‌ పాజిటివ్ వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. దీంతో ఆ 700 మందిని ఐసోలేషన్‌ల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామ‌ని అహ్మదాబాద్‌లో క‌రోనా నియంత్ర‌ణ‌ బాధ్యతలు నిర్వహిస్తున్న‌ అడిషనల్‌ చీఫ్ సెక్రెట‌రీ రాజీవ్‌ వెల్లడించారు.


logo